సమంతకు తమిళనాడు, తమిళ సినిమా ఇండస్ట్రీ పుట్టినిల్లు అయితే తెలుగు రాష్ట్రాలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ అత్తారిల్లు. మాతృభాష తమిళ్ కన్నా తెలుగులో ఈ చెన్నై సుందరికి ఎక్కువమంది అభిమానులు వున్నారు. తనకు ఎంతో ఆదరణ, ఆప్యాయత రావడానికి కారణమైన అత్తారింటి భాష తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంటుందీ సుందరి. అయితే… ‘మహానటి’ ముందు వరకూ ఒక్క సినిమాలో కూడా సమంత డబ్బింగ్ చెప్పుకోలేదు. ఎక్కువశాతం సినిమాల్లో ఆమెకు గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పారు. సావిత్రి బయోపిక్‌కి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అదీ తెలుగులో మాత్రమే. సొంత భాష తమిళంలో ఎందుకనో డబ్బింగ్ చెప్పుకోలేదు. ఆమె పాత్రకు ‘రంగస్థలం’లో ‘రంగమ్మా మంగమ్మా’ పాట పాడిన ఎంఎం మానసి డబ్బింగ్ చెప్పారు. ‘మహానటి’ని తమిళనాట ‘నడిగైయర్ తిలగం’ పేరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘జెమినీ’ గణేశన్ కుమార్తె అభ్యంతరాలు మినహా అక్కడ వివాదాలు ఏమీ లేవు. సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. మానసి డబ్బింగ్‌కి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో సమంతకు పేరు తెచ్చిన పతాక సన్నివేశాలు తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాల్లో మానసి డబ్బింగ్ చెప్పిన తీరుని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. తెలుగు కంటే తమిళంలో మాట్లాడడమే సమంతకు సులభం. మరి, మాతృభాషలో డబ్బింగ్ చెప్పుకోకుండా ఎందుకు హ్యాండ్ ఇచ్చారో మరి?