పెళ్లైన ప్రతి హీరోయిన్‌కీ ఎదురయ్యే ప్రశ్న ‘తల్లి ఎప్పుడు అవుతారు?’ అని! కానీ, తనను ఇప్పటివరకూ ఎవరూ ఈ ప్రశ్న అడగలేదని సమంత అంటున్నారు. సరే అనుకుని ‘తల్లి ఎప్పుడు అవుతారు?’ అని ప్రశ్నిస్తే… “ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు” అని నవ్వేశారు. ఆ తరవాత తన తెలివి చూపించారు. “దేవుడే పిల్లలు ఎప్పుడు? అనేది నిర్ణయిస్తాడు. నాకూ ఓ కుటుంబం ఉండాలని, నేనూ తల్లి కావాలని కోరుకుంటా. కాని ఆ అంశమై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోను” అని సమంత తెలిపింది. పిల్లల గురించి సమంత ఏం చెబుతుందో తెలుసుకుందామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వారంతా… ఆమె సమాధానాలు విన్న తరవాత “ఏం చెప్పింది” అనకుండా వుండలేకపోయారు. నాగచైతన్యను మొన్నో ఇంటర్వ్యూలో పిల్లల గురించి ప్రశ్నించగా… ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని చెప్పారు.
మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘యూ టర్న్’ సినిమాపై సమంత చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమాకు రీమేక్ అయినా… చివరి 30 నిమిషాలు మార్పులు చేశామన్నారు. అసలు, ఈ సినిమాను తానే నిర్మించాలని అనుకున్నానని సమంత తెలిపారు. అయితే… ఇటు యాక్టింగ్, అటు ప్రొడ్యూసింగ్ హ్యాండిల్ చేయడం కష్టమేమో అనే భావనతో ఆ ఆలోచనను విరమించుకున్నానని అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా సినిమాలు నిర్మిస్తానని చెప్పారు. అయితే… అందులో తాను నటించనని స్పష్టత ఇచ్చారు. వేరే నటీనటులతో సినిమాలు తీస్తారన్నమాట.