‘జగదీక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య ఇంద్రజగా శ్రీదేవికి సంబధించి ఓ పాపులర్ స్టిల్ వుంటుంది. వన్య ప్రాణులు చుట్టూ చేరి ఉండగా తెల్లని దుస్తులు ధరించి దేవ కన్యలా మెరిసిపోతుంటుంది శ్రీదేవి. ఇప్పుడు అచ్చు అదే స్టిల్ ని గుర్తుకు తెచ్చింది సమంత. సమంత కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ‘శాకుంతలం’ . మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ప్రకృతిని ప్రేమించే సుకుమార దేవత, గంభీర శాకుంతల’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఈ స్టిల్ చూస్తుంటే అచ్చు శ్రీదేవి లుక్ లానే వుంది. అయితే సమంతని ఇలా చూడటం అభిమానులకు కొత్తగా వుంది. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ భారీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయిలు విలువ చేసే ప్రత్యేకమైన సెట్ వేశారు. పాన్ ఇండియా సినిమాగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి మణిశర్మ మ్యూజిక్.