సమంత అనారోగ్యం పాలై, చికిత్స తీసుకొంటున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం గురించి సమంత స్వయంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వుంది. కొంతకాలం సినిమాలకు విరామం తీసుకొని.. పూర్తిగా ఆరోగ్యంపైనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకొంది. తన చేతికొచ్చిన సినిమాల్నీ వదిలేసింది. అయితే.. ఖుషి ప్రమోషన్లలో మాత్రం పాల్గొంటోంది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొంది. అంతేకాదు… హుషారుగా డాన్స్ కూడా చేసింది.
నిజానికి సోమవారం నుంచే సమంత ఆరోగ్యం బాలేదు. కానీ… సోమవారం డాన్స్ ప్రాక్టీస్ చేసింది. మంగళవారం విజయ్ తో కలిసి లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంత బయటకు రావడమే కష్టం. అలాంటిది.. డాన్స్. లైవ్ షో అంటే మామూలు విషయం కాదు. అనారోగ్యంతో బాధ పడుతున్నా సరే… తన సినిమా ప్రమోషన్ కోసం ధైర్యం చేసి ముందుకొచ్చింది. సమంత ఇప్పుడున్న కండీషన్లో `ప్రమోషన్‌కు రాను` అని చెప్పినా.. ఎవరూ చేయగలగింది ఏం లేదు. కానీ.. తనకు సినిమాపై ఉన్న ప్రేమతో ప్రమోషన్లలో ఓపిగ్గా పాల్గొంటోంది. సోమవారమే.. ఛానళ్ల కోసం కొన్ని ఇంటర్వ్యూలు పూర్తి చేసింది సమంత. విడుదలకు ముందు మరో వారం విరివిగా ప్రమోషన్లు చేయడానికి ఓకే అనేసింది. పారితోషికాలు తీసుకొని, ప్రమోషన్ కార్యక్రమాలకు రమ్మంటే, ఏవో సాకులు చెప్పి తప్పించుకొనే కథానాయికల కంటే… సమంత వెయ్యి రెట్లు నయం.