సమంత కొత్త పాత్రలోకి ప్రవేశిస్తోంది. హోస్ట్ గా. ఆహాలో `శామ్ జామ్` అనే టాక్ షో తో సమంత హోస్ట్‌గా మారిపోతోంది. ఇప్పటి వరకూ… అతిథి స్థానంలో కూర్చుని ఇంటర్వ్యూలు ఇచ్చిన స్టార్… ఇప్పుడు తానే ప్రశ్నల్ని సంధించబోతోంది. హోస్ట్ గా `బిగ్ బాస్ 4`లో ఓ ఎపిసోడ్ లో కనిపించింది సమంత. కాబట్టి సమంత ఈ పోగ్రాంని ఎలా నడిపించిందో ఊహించొచ్చు. కాకపోతే.. బిగ్ బాస్ 4కీ, సినిమాలకూ..మిగిలిన టాక్ షోలకూ `శామ్ జామ్` విభిన్నంగా ఉండబోతోందని సమంత చెప్పింది.
”బిగ్ బాస్ 4 కేవలం మా మామ కోసం చేశాను. అయితే.. దాన్ని కూడా ఓ ఛాలెంజ్ గా తీసుకున్నా. చాలా కసరత్తు చేశా. ఓ రాత్రంతా నిద్రపోలేదు. దాంతో పోలిస్తే.. ‘శామ్ జామ్’ విభిన్నమైన కార్యక్రమం. ఇది టాక్ షో కాదు. సమస్యల్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లే కార్యక్రమం. నా జీవితంలో పెద్ద ఛాలెంజ్. ఓ రకంగా చెప్పాలంటే.. హోస్ట్ గా ఉండడం కంటే, నటనే తేలిక అనిపించింది. నేను ఏ మాధ్యమంలో కనిపిస్తానా అని ఆలోచించలేదు.దీన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకుని చేశా” అని చెప్పుకొచ్చింది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోనే ఇలాంటి షో చూసి ఉండరని అరవింద్ ధీమాగా చెబుతున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి, కాఫీ విత్ కరణ్ లాంటి షోలకు పనిచేసిన టీమ్… `శామ్ జామ్`కి పని చేశారు. ”ఆహాని మరో మెట్టుకు తీసుకెళ్లే టాక్ షో ఇది. దక్షిణాదిలోనే ఇప్పటి వరకూ ఇలాంటి టాక్ షో జరగలేదు” అంటున్నారాయన.