సింగీతం శ్రీనివాసరావు చాలాకాలం తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. అందులోనూ ఓ బయోపిక్ తో. దేవదాసి `బెంగళూరు నాగరత్తమ్మ` కథని ఆయన తెరపై చూపించబోతున్నారు. ఆ పాత్రకు ఆయన ముందున్న మొదటి ఆప్షన్.. సమంత. ముందు సమంతకి ఈ కథ చెప్పి, తను నో చెబితే అప్పుడు మిగిలిన ఆప్షన్ల జోలికి వెళ్లాలని భావించారు సింగీతం. సమంతతో ఇది వరకు ఒకట్రెండు సార్లు సంప్రదింపులు కూడా అయ్యాయి. కానీ.. సమంత నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు సమంత ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. జనవరి నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం. ఇది కాకుండా సమంత సోనీ ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది. నవంబరులోనే ఈ సినిమా మొదలు కానుంది. ఆ తరవాత కొంత బ్రేక్ ఇచ్చి.. సింగీతం సినిమా సెట్స్‌లో పాల్గొంటుంది సమంత. ఈ బయోపిక్ లో సమంతతో పాటు మరి కొంతమంది స్టార్లు కనిపిస్తారు. వాళ్ల కోసం చిత్రబృందం గట్టిగానే అన్వేషిస్తోంది.