“పేరూ గీరూ వద్దు… పైసల్ వస్తే చాలు. నాకు డబ్బులు రావడమే ముఖ్యం” అంటోంది సమంత. తనకు వచ్చే రెమ్యునరేషన్ గురించి కాదు… సినిమాకు వచ్చే వసూళ్ల గురించి మాట్లాడుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యూ టర్న్’. ఈ సినిమా ఎల్లుండి (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశంసలు, విమర్శలు, సినిమా వసూళ్ల గురించి సమంత మాట్లాడారు. “సినిమా అనేది బిజినెస్. ఎవరైనా లాభాలు రావాలని సినిమాలు తీస్తారు. సినిమాకు పేరు వచ్చి, వసూళ్లు రాకపోతే ఎందుకు? నాకు పేరు ముఖ్యం కాదు. వసూళ్లే ముఖ్యం. సినిమాకు డబ్బులు రావడమే ముఖ్యం. అందుకని, ‘యూ టర్న్’ సినిమా ప్రారంభించే ముందు బడ్జెట్ గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాము. షూటింగులో లగ్జరీలు నాకు ముఖ్యం కాదు. మంచి సినిమాలో భాగం కావడం ముఖ్యం. ‘యూ టర్న్’ మంచి సినిమా అని తెలుసు. కన్నడలో ట్రయిలర్ విడుదల కాగానే దర్శకుడు పవన్ కుమార్ కి ఫోన్ చేశా. స్క్రిప్ట్ మెయిల్ చేయమని అడిగా. నాకు బాగా నచ్చింది. అందువల్ల షూటింగులో లగ్జరీల గురించి ఆలోచించకుండా సినిమా చేశా” అన్నారు.