లాక్ డౌన్ వల్ల షూటింగుల్లేవు, సినిమాల్లేవు. కథలు వినడాలు లేవు. కొత్త సినిమాలు ఒప్పుకోవడాలు లేవు. అంతా ఇంటి పట్టునే ఉన్నారు. అయితే… దర్శక నిర్మాతలకు హీరో, హీరోయిన్లు… మిగిలిన టెక్నీషయన్లూ ఫోన్లో టచ్లో ఉంటున్నారు. సమంత మాత్రం ఫోన్లో కూడా ఎవరికీ అందుబాటులో ఉండడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సమంత పీఆర్ మేనేజ్మెంట్ కాస్త స్ట్రాంగ్ గానే ఉంటుంది. జర్నలిస్టులకూ సమంతకు దూరం ఫోన్ కాల్ మాత్రమే. అయితే ఇప్పుడు మాత్రం సమంత భిన్నంగా ప్రవర్తిస్తోంది. లాక్ డౌన్ సమయంలో అటు మీడియాకు గానీ, ఇటు దర్శక నిర్మాతలకు గానీ అందుబాటులో లేదు. కొత్త కథలు వినడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇది వరకే కథలు వినిపించిన దర్శకులు, అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు సమంత ని `రీచ్` అవ్వాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని టాక్. ప్రస్తుతం సమంత ఇంటి పట్టునే ఉంటుందని, సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, కొన్నాళ్ల పాటు కుటుంబ జీవితం గడపడానికి మొగ్గు చూపిస్తోందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సమంత దృష్టి మాతృత్వం వైపు మళ్లిందని, ఆమె కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందన్న వార్తలూ ఊపందుకుంటున్నాయి. మరి సమంత మనసులో ఏముందో ఆమెకే తెలియాలి.