” వ్యక్తిగత సంక్షోభంలో మీ భావోద్వేగ స్పందనలు నన్ను సంతోషపరిచాయి. ఎంతో లోతైన సానుభూతి చూపించినందుకు మాత్రమే కాకుండా నా మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, పుకార్ల నుంచి కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నందుకు కృతజ్ఞతలు. నాకు ఎఫైర్లు ఉన్నాయని.. పిల్లలు వద్దనుకున్నానని..నేనో అవకాశవాదినని వాళ్లంతా ఇప్పటి వరకూ ప్రచారం చేశారు. ఇప్పుడు అబార్షన్లు అయ్యాయని కూడా చెబుతున్నారు.
విడాకులు అనేది ఎంతో బాధాకరమైన విషయం. ఈ బాధ నుంచి బయట పడేందుకు నాకు కొంత సమయం ఇవ్వండి. నా మీద జరుగుతున్న ఈ వ్యక్తిగత దాడి కనికరం లేనిది. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇలాంటి ఎట్టిపరిస్థితుల్లోనూ సహించను.. అంగీకరించను.
ఇంతటితో వదిలేయండి !”
ఇది సమంత ఇన్స్టామ్గ్రామ్లో పెట్టిన పోస్ట్.
జీవితంలో ఊహించనంత ఎదురు దెబ్బ తగిలి తీవ్రమైన మనో వ్యధలో ఉన్న మనిషిని తప్పుడు ప్రచారాలతో కొంత మంది కాకులు, గద్దల్లా పొడుచుకూ తింటూంటే ఎంత బాధ ఉంటుందో అదంతా ఈ పోస్టులో కనిపిస్తోంది. జీవితాంతం కలిసి ఉంటామని బాసలు చేసుకుని.. హఠాత్తుగా విడిపోవాల్సిన పరిస్థితుల్లో సమంత చాలా హుందాగా వ్యవహరించింది. ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. ఎందుకీ పరిస్థితి వచ్చిందో ఎక్కడా చెప్పుకోలేదు. తన జీవితం అన్యాయం అయిపోయినా… తన వల్ల ఎవరికీ చెడ్డపేరు రాకూడదని మౌనాన్నే ఆశ్రయించింది.
కానీ ఆమె మౌనమే తప్పన్నట్లుగా కొంత మంది ఆమె క్యారెక్టర్‌పైనే నిందలేస్తూ తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. ఆమెకు అఫైర్లు అంటగట్టారు. పర్సనల్ స్టైలిస్ట్ తో దిగిన కొన్ని ఫోటోలను చూపించి అనకూడదని మాటలు అన్నారు. కానీ ఆ పర్సనల్ స్టైలిస్ట్ గురించి ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసు. అది అసలు కారణమే కాదని కూడా తెలుసు. కానీ తెలిసి కూడా సమంత క్యారెక్టర్‌ను మీడియాలో, సోషల్ మీడియాలో “సేలబుల్ ఐటమ్”గా చేసుకుని రెచ్చిపోతున్న కొంత మంది వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మొదట ఎఫైర్లు అన్నారు.. తర్వాత పిల్లలు వద్దనుకుందని.. సినిమాలే చేస్తానని పట్టుబట్టడంతో కుటుంబంలో గొడవలు వచ్చాయని ప్రచారం చేశారు. అలా ఉండగానే మళ్లీ ఆమె పచ్చి అవకాశ వాది ప్రచారాన్ని కూడా ఉద్ధృతం చేశారు. ఇప్పుడు కొత్తగా అబార్షన్లు కూడా చేయించుకుందని చెప్పడం ప్రారంభించారు.
కుటుంబాన్ని కోల్పోయిన ఏ అమ్మాయిపైనైనా ఎవరైనా సానుభూతి చూపిస్తారు. కానీ ఇక్కడ సమంతపై మాత్రం అత్యంత దారుణంగా దాడి చేస్తున్నారు. తప్పంతా ఆమెదే అన్నట్లుగా చేస్తున్నారు. వ్యక్తిగత విషయాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకుదామని ఆమె ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతగా సమాజం నుంచి తనను తాను దాచుకుంటున్నప్పటికీ.. వెదికి వెదికి మరీ తీసుకొచ్చి పొడుస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో కానీ ఓ అమ్మాయి జీవితంపైన.. మనసుపైనా అత్యంత దుర్మార్గమైన దాడి చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. గుర్తించి చేస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు సైకోలు.
ప్రస్తుతం సమంత అత్యంత ఆవేదనతో పెట్టిన ఇన్స్టాగ్రామ్ సందేశంతో అయినా ఈ మీడియా, సోషల్ మీడియా కాకులు, గద్దలు పొడుచుకు తినడం ఆపేస్తాయా..? ఇప్పటికే మానసికంగా సగం చచ్చిపోయిన ఓ యువతి మనసును పూర్తిగా చంపేస్తాయా ?