అక్కినేని ఇంట్లో ఓ శుభకార్యం అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అఖిల్ – శ్రియా భూపాల్ల పెళ్లికి సడన్గా బ్రేకులు పడడంతో నాగ్ ఫ్యామిలీ కాస్త కలవరపాటుకు గురైనట్టు తెలుస్తోంది. అంతేనా..? ఈ చేదు అనుభవం సమంతలో లేనిపోని గుబులు రేపినట్టు తెలుస్తోంది. ఇంత వరకూ.. ‘ఆగస్టులోనో, సెప్టెంబరులోనో పెళ్లి చేసుకొందాంలే’ అని నిదానించిన సమంత.. సడన్ గా ప్లేటు పిరాయించి ‘ఎంత వీలైతే అంత త్వరగా చేసుకొందాం’ అంటోందట. చిత్రసీమలోని సంబంధ బాంధ్యవ్యాల గురించి తెలియందేం కాదు. ఏ అనుబంధం… ఎప్పుడు రివర్స్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అఖిల్ – శ్రియాల పెళ్లి క్యాన్సిల్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. పెళ్లికి అంతా సిద్ధం అనుకొంటున్న సమయంలో.. షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అందుకే సమంత కూడా జాగ్రత్త పడిపోతోందట. పెళ్లి విషయంలో చైతూ పై ఒత్తిడి పెంచుతోందని తెలుస్తోంది.
నిజానికి అటు నాగచైతన్యకూ పెళ్లి విషయంలతో తొందరేం లేదు. బ్యాచిలర్ లైఫ్ ఇంకొంత కాలం ఎంజాయ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. దానికి తోడు సమంత, తాను కలిసే ఉంటున్నారు కాబట్టి ‘పెళ్లి’కి తొందర పడడం లేదు. నాగ్ కూడా అఖిల్ పెళ్లయ్యాకే… చైతూకి పెళ్లి చేద్దామనుకొన్నాడు. కానీ.. ఇప్పుడు అఖిల్ పెళ్లి కథలో అనుకోని ట్విస్ట్ వచ్చేసరికి ప్లాన్ మొత్తం మారిపోయింది. టాలీవుడ్లో అఖిల్ బ్రేకప్ హాట్ న్యూస్ అయ్యింది. కనీసం అఖిల్ బ్రేకప్ నుంచి జనాల దృష్టి మరల్చడానికైనా చైతూ – సమంతల పెళ్లి డేట్ త్వరలోనే ఖాయం చేసే అవకాశాలున్నాయని అక్కినేని కాంపౌండ్ వర్గాలే చెబుతున్నాయి. అఖిల్ కోసం అనుకొన్న పెళ్లి డేటుకి కాస్త అటూ ఇటూగా చైతూ – సమంతల పెళ్లి జరిగిపోడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంతకీ ఇదే కావాలి. కాబట్టి ఆమె వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలూ ఉండకపోవొచ్చు. మరి చైతూ ఏమంటాడో..?