గుణశేఖర్ కలల చిత్రం ‘శాకుంతలం’. సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సంబంధించిన పెద్దగా అప్ డేట్లు రావడం లేదు. రిలీజ్ డేట్ పై కూడా ఎలాంటి స్పష్టతా లేదు. ఆమధ్య నవంబరు 4న ఈ చిత్రాన్ని తీసుకొస్తామని చిత్రబృందం తెలిపింది. అయితే.. ఇప్పుడు నంబరు 4న కూడా రావడం లేదు. ఈ సినిమా మరింత ఆలస్యమవుతోంది. దానికి కారణం… శాకుంతలంని త్రీడీ టెక్నాలజీలో మార్చడమే. ఈ సినిమాని ఇప్పుడు త్రీడీలో చూపించాలని గుణశేఖర్ నిర్ణయం తీసుకొన్నాడు. అందుకే ఈ సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది.
ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ధృవీకరించింది. తమ ప్రయత్నాన్ని భారీ ఎత్తున, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని, అందుకే శాకుంతలం ఆలస్యం అవుతోందని, త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని గుణశేఖర్ ప్రకటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.