కిర్లంపూడిలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో పాటు నిషేదాలు నిర్బంధం తీవ్రం కావడంపై వస్తున్న విమర్శలు ఎపి పోలీసులకు బాగా కోపం తెప్పిస్తున్నట్టున్నాయి. సెక్షన్ 30 అమలులు వుంది గనక 144 కూడా విధించబడింది గనక ఎలాటి యాత్రలు ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులను భారీ ఎత్తున మొహరించడంతో ఉద్రిక్తత పెరిగింది. ముద్రగడ సవాలు కన్నా ఈ స్పందన ఎక్కువగా వుందన్న మాట అందరిలో వినిపిస్తున్నది. ఇలాటి సమయంలో డిజిపి సాంబశివరావు మరోసారి మీడియాతో మాట్లాడారు. పోలీసు అధికారిగా శాంతి భద్రతల పరిరక్షణ కఠిన చర్యల వంటివి మాట్లాడవచ్చు. తమ వైఖరిని సమర్థించుకోవచ్చు. కాని ఆయన ఆ గీతలు దాటి రాజకీయ పార్టీలు పిలుపులిస్తుంటాయని, వాటికి స్పందిస్తే తర్వాత కలిగే పర్యవసానాలు మరోలా వుంటాయని పదే పదే పాత ఘటనలు ఉదహరిస్తూ చెప్పారు. 1994లో జరిగిన వాటి నుంచి మొన్నట్ి తుని రైలు బోగీ ధగ్ధం వరకూ మాట్లాడారు. కాపు యవతకు నేరుగా విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ మామూలుగా పోలీసులు చేయరు. ఈ తేదీలలోనే కొందరు రకరకాల పేర్లతో పోలీసు స్టేషన్ల ముట్టడికి పిలుపునిచ్చారని చెబుతూ అలాటి వాటికి భయపడబోమన్నారు. గతంలో పోలీసింగు లేదని కాదు అంటూనే ఇప్పుడు కేసులు పెట్టడం అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోతుందని హెచ్చరించారు. ఈ మాటలే మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. మొత్తంపైన ఇదంతా చూశాక ప్రభుత్వాదేశం మేరకు కావాలనే గట్టి హెచ్చరిక చేసేందుకు సాంబశివరావు ఇవన్నీ మాట్లాడారని స్పష్టమవుతుంది.పిలుపుపై వచ్చేవారిని అరెస్టుచేయొచ్చు గాని ముందే రావద్దని చెప్పడం పోలీసుల పని కాదు. పాతికేళ్ల కిందట పరిస్థితులేమిటో తప్పొప్పుటేమిటో వివరించకుండా తీర్పులు చెప్పడం మరో విపరీతం. గతంలో వలె కాదని చెప్పడమంటే ఇది వరకటి పోలీసింగును కూడా కించపరచడమే.సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారమే తాము ఇలా ఖచ్చితంగా వ్యవహరించాల్సి వస్తుందని వాదించిన డిజిపికి అదే కోర్టు హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించాలి కదా!