ఆ కంపెనీ గత మార్చిలో అంచనాల కన్నా 4.8 శాతం ఎక్సెస్‌కు పనులు దక్కించుకుంది. ఆరు నెలల్లో ఆ కంపెనీ పనులు కనీసం ప్రారంభస్థాయిలో కూడా చేయలేకపోయింది. ఒక్క శాతం కన్నా.. తక్కువ పనులే పూర్తి చేసింది. పనులు పూర్తి చేయడానికి గడువు మాత్రం… సగం పూర్తయిపోయింది. ఇప్పుడు అదే కంపెనీ ఏకంగా 15.60 శాతం తక్కువకు పనులు చేస్తామని.. రివర్స్ టెండర్ వేసింది. దానికి ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తుంది. ఎక్సెస్‌కే టెండర్ తీసుకుని… పనులు చేయలేకపోయిన సంస్థ… అంత కంటే తక్కువకు తీసుకుని పనులు ఎలా చేస్తుంది..? . కానీ చేస్తుందని ఏపీ సర్కార్ చెబుతోంది. తాము రివర్స్ టెండర్ల ద్వారా రూ. 58 కోట్లు ఆదా చేశామని … ఇదంతా చంద్రబాబు జేబుల్లోకి పోయేదని.. దాన్ని నిలుపుదల చేశామని ఘనంగా ప్రకటించింది.
పోలవరంలోని 65వ ప్యాకేజీలో బాగంగా పోలవరం టన్నెల్, నేవీగేషన్ కెనాల్ పనులకు తొలిసారిగా రివర్స్ టెండరింగ్ లో శుక్రవారం ఓ బిడ్ ను ఖరారు చేసింది. గతంలో మ్యాక్స్ ఇన్ ఫ్రా టెండర్లలో 4.8 శాతం అదనంగా కోట్ చేసి రూ. 274.25 కోట్లకు టెండర్లు దక్కించుకుంది. వైసీపీ సర్కార్ మ్యాక్స్ ఇన్ ఫ్రా టెండర్ ను రద్దు చేసింది. తాజాగా రివర్స్ టెండరింగ్ లో మళ్లీ ఈ ప్యాకేజీకి టెండర్లు పిలిచింది. ఇందులో మొత్తం ఆరు సంస్థలు పాల్గొన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ-ఆక్షన్ లో రివర్స్ టెండరింగ్ కు రెండు గంటల 45 నిమిషాలపాటు నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండర్ ఖరారు చేసింది. 15.60 శాతం తక్కువకు ఈ సంస్థ టెండర్ వేసి 231.47 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఈ సంస్థే గతంలో పనులు ఒక్క శాతం కూడా పూర్తి చేయలేదు.
ఈ మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెపై… గతంలో సాక్షి పత్రిక… చాలా కథనాలు రాసింది. దేవినేని ఉమా మహేశ్వరరావు బినామీ కంపెనీ అనే దగ్గర్నుంచి ఆ కంపెనీ గతంలో చేపట్టిన పనుల్లో ఒక్కటంటే.. ఒక్కటీ పూర్తి చేయలేదని.. అలాంటి కంపెనీని ఎందుకు ప్రొత్సహిస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడు అదే కంపెనీ… అత్యంత తక్కువకు రివర్స్ టెండర్ వేస్తే.. ప్రభుత్వం అంగీకరించింది. రేపు పనులు గిట్టుబాటు కావని చేతులెత్తేస్తే… అడిగినంత ధర ఇచ్చి పనులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని కోసమే.. ప్రస్తుతం ఇలా అతి తక్కువకు టెండర్ వేశారనే … కాంట్రాక్ట్ రంగంలో నిపుణులు… చెబుతున్నారు.