పైన రేకులు…వేడెక్కకుండా, వానకి చప్పుడు రాకుండా రేకుల మీద ఎండు గడ్డి. గడ్డి ఎగిరిపోకుండా రాళ్ళతో వేలాడ దీసిన గడ్డి తాళ్ళు…చుట్టూ మేదరతడికెలు, నేలంటే కటిక నేలే, బెంచీ, కుర్చీ, రిజర్వుడు (చేతుల కుర్చీ) క్లాసులకు మధ్యలో తడికెల గోడ…ఇది శ్రీ కనకదుర్గా టూరింగ్ టాకీసు…రాత్రి పూట సినిమా పగటిపూట (కొద్ది నెలలు) శ్రీదామోదరం సంజీవయ్య జూనియర్ కాలేజి. 1970 లో ఇది పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం…అంటే మా ఊళ్ళో వుండేది…
తక్కువ ఖర్చుతో కట్టుకునేవి, వద్దనుకున్నప్పుడో మరోఊరు తరలిపోవాలనుకున్నపుడో పీక్కుపోడానికి వీలైనవి…అయిన సినిమా హాళ్ళను టూరింగ్ టాకీసులు అనేవారు.
ఆస్ట్రేలియాలో ” కంటెయినర్ థియేటర్ ” పేరుతో వున్న ఇదే కాన్సెప్టును చూసి వచ్చిన తెలుగు ఆసాములు విశాఖపట్టణం షీలానగర్ లో ఒక సినిమా ధియేటర్ కడుతున్నారు…కాకపోతే రేకుల మీద గడ్డికి బదులు కరెంటు ఇచ్చే సోలార్ పేనల్స్ పెడుతున్నారు. కటిక నేలకు బదులు ప్లై వుడ్ పేనల్స్ వేస్తున్నారు…కంటెయినర్ ధియేటరన్నా, టూరింగ్ టాకీసు అన్నా కాన్సెప్టు మాత్రం ఖర్చు తగ్గించుకోవడమే! అందుకు కొత్తకొత్త టెక్నాలజీలను సమన్వయం చేసుకోవడమే!
విశాఖ ఎయిర్ పోర్ట్ కి దగ్గర్లోని షీలానగర్ లో ఈ కొత్త కాన్సెప్ట్ థియేటర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి థియేటర్ల నిర్మాణంలో ఎక్కడా సిమెంటు అన్నది వాడరు. సిమెంటు గోడలకు బదులుగా డబుల్ ఇన్సులేషన్ తో ఉన్న ఐరన్ షీట్స్ వాడతారు. దీంతో.. షార్ట్ సర్క్యూట్స్ కు అవకాశం ఉండదు. ఫ్లోరింగ్ ను ఫ్లైవుడ్ తో చేస్తారు. ఫ్లైవుడ్ షీట్ల కింద ఇనుపరాడ్లతో బేస్ తయారు చేసి నిర్మిస్తారు. ఎందరి బరువునైనా ఈ బేస్ కాసేస్తుంది.
20 అడుగుల ఎత్తుతో నిర్మించే ఈ థియేటర్లో 31×14 అడుగుల స్క్రీన్ ను ఏర్పాటు చేస్తారు.ఇక.. థియేటర్ పైకప్పు మీద 20 కిలోవాట్ల తొమ్మిది సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. దీంతో.. సినిమా హాల్ కు అవసరమైన విద్యుత్ అవసరాల్ని తీరుస్తుంది. మిగిలిన అవసరాల్ని తీర్చుకోవటం విద్యుత్ అధికారుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ లేకుండా అయితే రూ.25 లక్షలతో పూర్తి అయ్యే ఈ థియేటర్.. సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలంటూ మాత్రం మరో రూ.11లక్షలు ఖర్చు అవుతుంది. ఇక.. ఏసీ వసతి కూడా కావాలంటే మరికాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. అనుకున్న బిజినెస్ నడవకపోతే ఈ థియేటర్ సెటప్ ను మరో చోటకు తరలించేయొచ్చు. టెంప్టింగ్ గా ఉన్న ఈ కాన్సెప్ట్ కు రానున్న రోజుల్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో మరి?
ప్రీ ఫాబ్రికేటెడ్ మెటీరియల్ తో కట్టే రేకుగోడల భవనాల 25 ఏళ్ళవరకూ చెక్కు చెదరవు. ప్రతి జిల్లా లోనూ వున్న సాక్షి దినపత్రిక ఆఫీసులు ఇలాంటి భవనాలే! రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక ఆఫీసు వసతి కోసం ఈ టెక్నాలజీ గురించి సీరియస్ గా ఆలోచించ వచ్చు!