వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవాళ తన పార్టీనుంచి నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోయినందుకు కుమిలిపోతుండవచ్చుగాక! పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఢిల్లీలో ఉండి అక్కడ రాజకీయం చేస్తున్నందుకు, రాష్ట్రానికి రావాల్సిన వాటన్నిటినీ సాధించడానికి ఢిల్లీ వెళ్లానంటూ ఒక ముసుగు వేసుకుని ఆయన రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ బిజీ షెడ్యూలు మధ్యలో కాస్తంత వెసులుబాటు చేసుకుని.. ఢిల్లీలోనే మీడియాతో కూడా మాట్లాడారు. సహజశైలిలో చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. వైకాపానుంచి ఫిరాయింపులకు తెదేపా తలుపులు తెరిచేసేలా.. ”గంటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తాను అన్న జగన్ మాటలే ప్రేరేపించాయి” అని అందరూ తననే వేలెత్తిచూపుతూ ఉండడం, ఈ వాదన ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లడం జగన్ను ఆత్మరక్షణలో పడేసినట్లుంది. తాను అలా అనలేదు.. అంటూ ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు గానీ.. అదే సమయంలో ఆయన చంద్రబాబునాయుడు ను మరింతగా రెచ్చగొడతున్నరని కూడా అనిపిస్తోంది.
జగన్మోహనరెడ్డికి ఇలాంటి సమయంలో చాలా ఆవేశం రావడం సహజం. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా అనైతిక చర్యకు పాల్పడినప్పుడు దాన్ని ధర్మాగ్రహంగా కూడా అభివర్ణించవచ్చు. కానీ జనంలో ఆయన పట్ల జాలి కలగకపోవడానికి కారణం ఉంది. ”తెదేపా వాళ్లు నాతో టచ్లో ఉన్నారు. ఆ సంఖ్య 21కు చేరగానే గంట ముందే మిమ్మల్ని పిలిచి తెలియజేస్తా! అలా చెప్పిన గంటలో ఈ ప్రభుత్వం పడిపోతుంది” అని చాలాస్పష్టంగా చెప్పి.. మీడియాముఖంగా చంద్రబాబును రెచ్చగొట్టింది జగనే కదా అని జనం లైట్ తీసుకుంటున్నారు.
ఇవాళ జగన్ ఆరునెలలుగా స్కెచ్ వేస్తున్నారు.. ఇన్నాళ్లకు నలుగురిని చేర్చుకోగలిగారు. అని ఆక్రోశిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆరునెలలుగా మంతనాలు సాగుతున్నా.. చేర్చుకోకుండా.. ఇప్పుడే చేర్చుకోవడానికి గల కారణం.. మీరు రెచ్చగొట్టిన మాటలే కదా.. అని జగన్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.
పైగా ఇప్పటికైనా జగన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అదీ లేదు! ఆయన చంద్రబాబును ఇంకా కెలకడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రెండో సంవత్సరం జరుగుతోంది. మూడో సంవత్సరం పూర్తయ్యాక చూడండి.. తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి రావడానికి క్యూ కడతారు.. అని ఇప్పటికీ అదే ప్రగల్భాలు పలుకుతున్నారు. (పైగా 21 మంది తన పార్టీలోకి రాగానే తెదేపా ప్రభుత్వం కూలిపోతుందంటూ.. జగన్ తన రాజకీయ అనవగాహనను, అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నారనే సంగతి తెలుగు 360 అందించిన నవీన్ పెద్దాడ వ్యాసం ‘పడేసేవీ పడుకోబెట్టేవీ అంకెలు కాదు అడుగులే‘ చదివిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.)
ఇప్పుడు చంద్రబాబు ద్వారా ప్రజాస్వామ్యానికి ద్రోహం జరిగిపోయిందని జగన్ ఆక్రోశిస్తున్నారు. ఏడాది తర్వాత అటునుంచి ఇటు క్యూ కడితే అది ద్రోహం అనిపించుకోదా? జగన్ గత ఏడాదిరోజులుగా.. ‘ఏడాదిలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మన ప్రభుత్వం వస్తుంది’ అని ప్రజల్లో చెబుతూ వస్తున్నారు. ఏ ప్రజాస్వామ్య విలువల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని.. ఈ ప్రజాస్వామ్య సమీకరణాల ప్రకారం అది సాధ్యమని ఆయన ఊహించారో చెప్పగలరా?
మరో సంగతిని కూడా జగన్ గుర్తుంచుకోవాలి. తన పార్టీలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేల్లో తనకు తప్ప ప్రతి ఒక్కరికీ తెలుగుదేశంనుంచి ప్రలోభాలు వచ్చాయని ఆయన అంటున్నారు. ఆయన పార్టీ ఎంత డొల్లగా ఉన్నదని ఆయన ఒప్పుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. 66 మందికి ఆఫర్లు ఇచ్చి.. కేవలం నలుగురిని చేర్చుకున్నారని మిగిలిన 62 మందికి హేట్సాఫ్ చెబుతున్నారు. ఇది గొప్పగానే ఉంది. కానీ.. 62 మందిలో కనీసం ఒక్కరైనా.. తెలుగుదేశం నుంచి తమకు ఆఫర్లు ప్రలోభాలు వచ్చిన వైనాన్ని ఆడియో రూపంలో గానీ, వీడియో రూపంలో గానీ రికార్డు చేసి.. వారి బండారాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించలేదు ఎందుకని? తెలంగాణలో ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన తర్వాత.. అలాంటి ట్రిక్కులు రాజకీయ నాయకులకు అర్థమైపోయాయి కదా? మరి జగన్ బ్యాచ్ 62 మందిలో ఒక్కరైనా ఆ పని చేయలేదంటే.. వారంతా ‘ఎందుకైనా మంచిది ఏనాటికైనా తెదేపాలోకి వెళ్లాల్సి వస్తుందేమో.. మనం ఇలా రచ్చకీడ్చడం ఎందుకు’ అనే వైఖరితో ఉన్నట్లే లెక్క. లేదా.. జగన్ ఆరోపిస్తున్నట్లు ప్రలోభాలు నిజమైతే.. ఆధారాలతో జగన్ చెప్పాలి. ఆయన పార్టీలో పార్టీపట్ల, జగన్ పట్ల నిబద్ధత, నిజాయితీ ఉన్న కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడా? అనేది ఆయన నిరూపించుకోవాలి.
చూడబోతే జగన్ మీద ఒకందుకు జాలి కలుగుతుంది. కేసులకు సంబంధించిన అసహనం.. ఆయన రాజకీయ దుడుకు వ్యాఖ్యలకు కారణం అవుతోంది. ఈడీ కేసులు ఆయన చుట్టూ బిగుసుకుంటున్నాయి. అక్కడ ఎంత కోపం వచ్చినా తాను చేయగలిగింది ఏమీ లేదు. ఆ కోపాన్ని ఇక్కడ ప్రదర్శించుకుంటున్నారు. మరో ఏడాది తర్వాత తెలుగుదేశాన్ని ‘కూలుస్తా’ అనే పదం వాడకపోయినా.. అంతలేసి మాటలూ అంటున్నారు. గోటితో పోయేదానిని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే. స్వయంకృతాపరాధాల్లో తనకెవ్వరూ సాటిరారని ఆయన నిరూపించుకోవడం అవుతుంది.