మొదటి విడత ఫలితాల తర్వాత టీడీపీ, వైసీపీ గెలుపు తమదంటే తమదని పోటాపోటీగా ప్రకటనలు చేసుకున్నాయి. ఎవరెవరి మద్దతుదారులు ఎన్నెన్ని సీట్లలో గెలిచారో ప్రజలకు స్పష్టత లేకుండా గందరగోళపరిచారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తాము వెయ్యి పంచాయతీలలో గెలిచామని ప్రకటించుకుంది. కానీ వైసీపీ మాత్రం తమ ఖాతాలో రెండు వేల పంచాయతీలు పడ్డాయని.. టీడీపీకి ఐదు వందలు కూడా రాలేదని స్పష్టం చేసింది. పంచాయతీల వారీగా లిస్టును టీడీపీ విడుదల చేసింది. తాము వెబ్ సైట్లో పెడతామని వైసీపీ నేతలు ప్రకటించారు. పార్టీల వారీగా జరిగే ఎన్నికలు కాకపోవడంతో.. గెలిచిన వారందరు తమ మద్దతుదారులేనని చెప్పుకోవడానికి రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.
అయితే కీలక నేతల గ్రామాల్లో తాము పాగా వేశామని చెప్పుకునేందుకు రెండు పార్టీలు.. చాలా కష్టపడుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలమర్రులో టీడీపీ బలపర్చిన అనూష అనే అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతే టీడీపీ నేతలు.. అసెంబ్లీ సీటులో గెలిచినట్లుగా హడావుడి ప్రారంభించారు. దీనికి కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ ముఖ్య నేతల గ్రామాల్లో తమ మద్దతుదారులు గెలిచారంటూ… హంగామా ప్రారంభించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం.. ఇలా కొంత మంది నేతల స్వగ్రామాల గురించి రాస్తూ పోయారు.
టీడీపీ, వైసీపీ నేతల హడావుడి … గ్రామాలలోనూ చర్చనీయాంశమవుతోంది. ఈ సారి ఎన్నికలు… భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. గ్రామాల్లోనూ జనం పార్టీల వారీగా విడిపోయారు. అయితే.. ఎక్కువగా గ్రామ పరిస్థితులే…ఓటింగ్‌ను ప్రభావితం చేస్తూంటాయి. చాలా గ్రామాల్లో సర్పంచ్ స్థానాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయి. పదవులు, వార్డు మెంబర్లు కూడా… అలాగే పంచుకున్నారు. గ్రామ రాజకీయాలు.. రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయవు. అయనప్పటికీ… రెండు పార్టీలు మాత్రం.. తమ రాజకీయాల్ని తాము చేసేస్తున్నాయి.