ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను ప్రభుత్వం ఖరారు చేసింది. నెలాఖరుకు ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేస్తారు. ఇప్పటికే ఆయనకు ఓ సారి పొడిగింపు ఇచ్చారు. మరోసారి పొడిగింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దీంతో ఆయనకు రిటైర్మెంట్ తప్పనిసరి అయింది. ఆ తర్వాత ఏదైనా సలహాదారు పదవి ఇస్తారో లేదో క్లారిటీ లేదు. మాములుగా అయితే చీఫ్ సెక్రటరీ రిటైరయ్యే ముందు రోజు లేదా రెండు రోజుల ముందు కొత్త చీఫ్ సెక్రటరీ ఫైనల్ చేస్తారు. కానీ ఏకంగా ఇరవై రోజుల ముందు సమీర్ శర్మ పేరును ఖరారు చేశారు.
నిజానికి సమీర్ శర్మ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కంటే రెండేళ్లు సీనియర్. కానీ వయసులో ఐదు నెలలు చిన్న. వచ్చే నెల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నా.. ప్రభుత్వం పొడిగింపులు ఇచ్చినా మహా అయితే ఓ ఐదు నెలలు మాత్రమే చీఫ్ సెక్రటరీగా ఉంటారు. అయితే సివిల్ సర్వీస్ అధికారులకు సీఎస్‌గా రిటైర్మెంట్ అవడం లక్ష్యం కాబట్టి..కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన ప్రత్యేకంగా మూడు నెలల కిందటే ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చే ముందు వరకు కేంద్ర ప్రభుత్వలోని అత్యంత కీలకమైన విభాగమైన కార్పొరేట్ ఆఫైర్స్ విభాగాన్ని చూస్తున్నారు. సీఎస్‌గా రిటైర్మెంట్ అయ్యే అవకాశం కోసం ఏపీకి వచ్చారు.
సమీర్ శర్మ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్‌కు సీఎస్‌గా అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. నిజానికి ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ఎంపికయ్యే సమయంలోనూ ఆయనపేరు వినిపించింది. ఆతరవాత సమీర్ శర్మ తెర మీదకు వచ్చారు. వచ్చే ఐదు నెలల్లో మరెవరూ అడ్డదారుల్లో రాకపోతే నీరబ్ కుమార్‌కే అవకాశం దక్కుతుంది. లేకపోతే ఆయనకు ఎదురు చూపులు తప్పకపోవచ్చు.