Sammathame movie review
రేటింగ్: 2.5/5
ఈమధ్య కాలంలో టాలీవుడ్‌కి దొరికిన మినిమం గ్యారెంటీ హీరో… కిరణ్ అబ్బవరపు. ఓ చిన్న సైజు కథిస్తే చాలు… దాన్ని తను కింగ్ సైజ్ గా మార్చేస్తున్నాడు. ఎస్.ఆర్.కల్యాణమండపం పెద్ద కథేం కాదు. కానీ… కిరణ్ దాన్ని `హిట్` సినిమా చేసేశాడు. ఓ మాదిరి కథ పట్టుకెళ్తే చాలు.. ఏదోలా మెస్మరైజ్ చేసేసి, సినిమాకి మినిమం ఓపెనింగ్స్ తీసుకొస్తాడన్న భరోసా కలిగించాడు. కానీ.. ఆ తరవాత చేసిన `సబాస్టియన్` బోల్తా కొట్టడంతో.. కథ విషయంలో రిస్క్ తీసుకుంటే, కిరణ్ తేలిపోతాడన్న నిజాన్ని తెలిసేలా చేసింది. ఇప్పుడు `సమ్మతమే..` అంటూ మరో కథ వినిపించడానికి రెడీ అయిపోయాడు. ఈ వారం 9 సినిమాలు బరిలో ఉంటే.. కాస్తో కూస్తో క్రేజ్ ఉన్నది ఈ సినిమాకే. అది కూడా కిరణ్ అబ్బవరపు గత సినిమాలతో సాధించిన క్రెడిట్ వల్ల సాధ్యమైంది. మరి.. ఈ సమ్మతమే ఎలా ఉంది? ఎవరు సమ్మతం తెలుపుతారు?
కృష్ణ (కిరణ్ అబ్బవరపు) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. ఆడదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో పసి వయసులోనే అర్థమవుతుంది. తాను పెళ్లి చేసుకొని, ఆ లోటు తీర్చాలనుకొంటాడు. అందుకే చిన్నప్పటి నుంచీ.. పెళ్లీ, పెళ్లీ అని కలలు కంటుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే, పెళ్లి చేసుకొని అమ్మాయిని ప్రేమించాలన్నది తన ఫిలాసఫీ. తనకు కాబోయే శ్రీమతి గురించి కొన్ని కలలున్నాయి. ఆ అమ్మాయి అబద్ధం ఆడకూడదు, ఇది వరకు లవ్వూ – గివ్వూ ఉండకూడదు, సంప్రదాయబద్ధంగా ఉండాలి.. ఇలాంటి లిస్టు పెట్టుకొని పెళ్లి చూపులకు బయల్దేరతాడు. తొలి పెళ్లి చూపుల్లోనే శాన్వి (చాందిని చౌదరి) ఎదురవుతుంది. కృష్ణ ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాడో.. దానికి ఆపోజిట్ లక్షణాలు శాన్విలో ఉంటాయి. కానీ.. తనని మార్చుకోగలన్న నమ్మకంతో… శాన్వి ప్రేమలో పడిపోతాడు కృష్ణ. మరి.. శాన్విని మార్చుకొన్నాడా లేదా? ఈ ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? అసలు ప్రేమంటే ఏమిటో కృష్ణకు ఎప్పుడు, ఎలా అర్థమైంది? అనేదే మిగిలిన కథ.
దర్శకుడు గోపీనాథ్ రెడ్డి… చాలా సింపుల్ లైన్‌ని ఎంచుకొన్నాడు. ఎవరి ఇష్టాలువాళ్లకుంటాయి, ప్రేమలో పడినంత మాత్రాన ఆ ఇష్టాల్ని మార్చుకోవాల్సిన పనిలేదు. ఓ వ్యక్తిని ఇష్టపడితే… వాళ్లలోపాల్ని కూడా ఇష్టపడాలి.. అనేదే తాను చెప్పాలనుకొన్న పాయింట్. సింపుల్ పాయింటే కానీ.. ఎత్తుకొన్నది మంచి విషయమే. ఇలాంటి లైన్లతో ఇది వరకు కూడా కొన్ని కథలొచ్చాయి. అయితే.. వాటిని ఎపిసోడ్లకే పరిమితం చేస్తూ.. ఆ ప్రేమకథలో మరో సంఘర్షణ వెదుక్కొన్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. కథా అదే, సంఘర్షణా అదే. చాలా చిన్న పాయింట్లు పట్టుకొన్నప్పుడు.. అవి బాగానే కనిపించినా, తెరపైకి తీసుకొచ్చేటప్పటికి మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఎంత చెప్పినా అదే పాయింట్ తిప్పి తిప్పి చెప్పాలి. కొత్త సీన్లు రాసుకోకపోతే.. దొరికిపోతారు. `సమ్మతమే`కి ఆ సమస్య ఎదురైంది. కిరణ్ అబ్బవరపు నటన, చాందిని క్యారెక్టరైజేషన్, మధ్యమధ్యలో పాటలు.. ఇవన్నీ కాస్త మెస్మరైజ్ చేస్తున్నట్టు అనిపించినా అవి సరిపోలేదు.
హీరో పాత్రలో ఎందుకో స్టెబులిటీ కనిపించలేదు. ఇది వరకు ఒకరి ప్రేమలో ఉన్న అమ్మాయిని.. పెళ్లి చేసుకోకూడదు.. అని అనుకుంటాడు. వెంటానే తన నిర్ణయం మార్చుకుంటాడు. సంప్రదాయం, పద్ధతీ తెలిసిన అమ్మాయి కావాలనుకొంటాడు. అక్కడా రాజీ పడతాడు. శాన్విని ప్రేమించడానికి బలమైన కారణాలేం కనిపించవు.వద్దని వదలుకోడానికీ అంతే. అసలు స్థిరత్వం లేని పాత్రలో సినిమాని నడిపించాలని ఎలా అనుకొన్నాడో? అలాగని శాన్వి పాత్రనైనా కొత్తగా, ఆసక్తిదాయంగా తీర్చిదిద్దాడంటే పూర్తిగా అదీ కనిపించదు. ఇది వరకు సినిమాల్లో అబ్బాయిలకు ఏ లక్షణాలైతే ఆపాదిస్తూ, క్యారెక్టరైజేషన్‌ని బిల్డప్ చేస్తారో, సరిగ్గా అలాంటి లక్షణాలే ఇక్కడ హీరోయిన్ పాత్రలో కనిపిస్తాయి. అంటే మందు కొట్టడం, ఇంట్లో అబద్ధాలు ఆడడం, బార్లూ, పార్టీలకు వెళ్లడం ఇవన్నమాట. చాందినీ చౌదరిని ఈ తరహా పాత్రలో చూడడం కొత్త కాబట్టి… కాస్తో కూస్తో ఫ్రెష్‌నెస్ కనిపించింది. ఎలాగైనా శాన్విని మార్చుకోవాలని కృష్ణ ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో విఫలం అవ్వడం.. ఇదే కాన్ఫ్లిట్ పాయింట్ అయ్యింది. చివర్లో.. `ఎవరి జీవితం వాళ్లది.. వాళ్ల బతుకు కూడా నువ్వే బతికేస్తానంటే ఎలా` అని తండ్రి పాత్రతో చెప్పించి – ఈ కథకు ముగింపు పలికాడు దర్శకుడు. కథలో తండ్రి పాత్రని తీసుకొచ్చి, ముగించడం బాగుంది. మరీ భారీ డైలాగులూ, హెవీ మెలోడ్రామాలు లేకుండా సింపుల్ గానే ముగించారు. పతాక సన్నివేశాల్లో హీరో తండ్రి చెప్పే మాటలు.. దానికి హీరోలో మార్పు రావడం ఇవన్నీ సహజంగానే కనిపించాయి. సినిమాలో ఎక్కడా జోష్ ఉండదు. అలా.. అలా వెళ్తుంటుందంతే. ఓటీటీ కోసం తీసి, థియేటర్లో రిలీజ్ చేసిన సినిమాలా అనిపించింది. ఓటీటీలో అయితే.. కాస్త ఓపిగ్గా చూసిన వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి.
కిరణ్ అబ్బవరపు తన సహజమైన నటనతో ఆకట్టుకొన్నాడు. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో అల్లుకుపోయాడు. ఎమోషన్ డైలాగులు పలికేటప్పుడు మరింత మెచ్యూరిటీ కనిపించింది. అయితే… తనలో బోలెడంత ఎనర్జీ ఉంది. దాన్ని వాడుకోలేకపోయాడు దర్శకుడు. అయినప్పటికీ.. అక్కడక్కడ తనదైన కామెడీ టైమింగ్‌తో రక్తికట్టించాడు. చాందినికి ఈ తరహా పాత్రలు పూర్తిగా కొత్త. పాటల్లో తాను తేలిపోయింది. మరీ పీలగా కనిపిస్తోంది. ఇలాంటి పాత్రలో బబ్లీ హీరోయిన్ని ఎంచుకొంటే.. ఆ పాత్ర గ్రాఫే మారిపోయేది. సద్దాం ఓ చిన్న పాత్రలో కనిపించాడు. కానీ నవ్వించలేకపోయాడు. సప్తగిరిదీ అదే దారి. గుళ్లో ముస్టోళ్ల గోల…లాంటి సీన్లు కత్తెరిస్తే బాగుండేది.
శేఖర్ చంద్ర పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. అవి కూడా థియేటర్ వరకే. నేపథ్య సంగీతం కూల్ గా ఉంది. దర్శకుడు కొన్ని సీన్లు బాగానే హ్యాండిల్ చేసినా.. చాలా చిన్న లైన్ పట్టుకోవడంతో.. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టేలా సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. ఫాదర్ సెంటిమెంట్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని డైలాగులు ఆకట్టుకొన్నాయి. రోజులు బాగాలేవు అన్నప్పుడు మారాల్సింది రోజులే కాని, అమ్మాయిలు కాదు… అనే డైలాగ్ ఈనాటి సమాజానికి, అందులోని వ్యక్తుల ధోరణికి అద్దం పడుతుంది. షార్ట్ ఫిల్మ్‌కి సరిపడే కంటెంట్ ఇది. దాన్ని సినిమాగా తీద్దామనుకొన్నారు. కానీ.. ఆ సమీకరణాలు కుదర్లేదు. కాస్త ఓపిక ఎక్కువగా ఉండి, ఫీల్ గుడ్ మూవీస్‌ని చూద్దామనుకొన్నవాళ్లకు ఇది `సమ్మతమే` కావొచ్చు.
రేటింగ్: 2.5/5