రచ్చ తరవాత.. సంపత్ నంది పై నమ్మకం కలిగింది. మాస్ సినిమాల్ని బాగానే తీస్తాడన్న పేరు తెచ్చుకొన్నాడు. రచ్చ సినిమా టైమ్ లోనే ‘చోటా మేస్త్రీ’ అనే టైటిల్ ఆకట్టుకొంది. ‘రచ్చ’ తరవాత రామ్ చరణ్ – సంపత్ మళ్లీ కలసి పనిచేస్తారని, అది ‘చోటా మేస్త్రీ’నే అని.. చిరంజీవి ‘ముఠా మేస్త్రీ’ సినిమాకి ఇది సీక్వెల్ అని రకరకాల కథనాలు వినిపించాయి. సంతప్ నంది ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. చోటా మేస్త్రీ టాపిక్ నడిచేది. బెంగాల్ టైటర్కి ముందూ చరణ్ – సంపత్‌ల కాంబో వార్తల్లోకి వచ్చింది. అయితే.. అసలు విషయం ఏమిటంటే… ‘చోటా మేస్త్రీ’ అనే కథే లేదట. జస్ట్ టైటిల్ ఒక్కటే ఉందట. దాని చుట్టూ ఇప్పుడు కథ అల్లాలట. ఈ విషయాన్ని.. సంపత్ నందినే చెప్పుకొచ్చాడు.
”చోటా మేస్త్రీ అనే కథేం లేదు. జస్ట్ ఐడియా మాత్రమే ఉంది. కూర్చుని స్క్రిప్టు రాసుకోవాల్సిందే” అంటున్నాడు. ఈ మాత్రం దానికి.. సినిమా చేస్తున్నట్టు, అందులో చరణ్ హీరో అయినట్టు, ఈ కాంబో మొదలైపోయినట్టు వార్తలు ఎందుకు వచ్చినట్టో. నిజానికి సంపత్ నంది దగ్గర రెడీమెడ్గా కథలేం లేవు. అప్పటి కప్పుడు అల్లుకోవడమే తనకి ఇష్టమట. కథలు రాసుకొని బీరువాలో పెట్టుకోవడం తనకు ఇష్టం ఉండదని, అప్పటికప్పుడు అనుకొని.. ఐడియాని సినిమాగా మార్చుకొంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమా తీయొచ్చని అంటున్నాడు సంపత్. తదుపరి సినిమాకీ అంతే నట. ‘గౌతమ్ నందా’ తరవాత సినిమా కోసం ఇంకా కథ రెడీ కాలేదని, ‘గౌతమ్ నందా’ రిలీజ్ అయ్యాక.. ఆ కథ గురించి ఆలోచిస్తానని చెప్పాడు సంపత్. అందుకనేనేమో.. సినిమా సినిమాకీ అంతంత గ్యాప్ వచ్చేస్తుంటుంది. ఈ ఎనిమిదేళ్లలో మూడంటే మూడు సినిమాల్నే తీశాడు సంపత్. ఈ స్పీడు సరిపోదు మరి. దర్శకుడిగా జోరు పెంచాలంటే.. కథ విషయంలో ఇంకాస్త ఫాస్ట్ గా ఉంటే మంచిదేమో.