ఈరోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులదే రాజ్యమైపోయింది. ఒకట్రెండు మంచి హిట్లు, గుర్తిండిపోయే క్యారెక్టర్లు పడితే చాలు.. అమాంతంగా పారితోషికాల్ని పెంచేస్తున్నారు. క్రేజు ఉన్నప్పుడే క్యాషు చేసుకోవాలన్న సినీ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి వాళ్లలో… `మిర్చి` సంపత్ ఒకరు. మిర్చి సినిమాతో సంపత్ టాలీవుడ్ విలన్ల గ్యాంగ్‌లో ప్రధాన సభ్యుడైపోయాడు. మొన్నొచ్చిన `భీష్మ`తో తాను కూడా నవ్వించగలనని నిరూపించాడు. ఇప్పుడు చిరంజీవి 152 వ చిత్రం ఆచార్యలో సంపత్ కి ఓ మంచి పాత్ర దక్కింది. అయితే.. సంపత్ పారితోషికం చూసి చిత్రబృందం డంగైపోయింది.
సంపత్ కనీవినీ ఎరుగని పారితోషికాన్ని కోడ్ చేయడంతో.. చిత్రబృందం డైలామాలో పడిందని టాక్. సాధారణంగా చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు పారితోషికం గురించి పెద్దగా ఆలోచించరు. పైగా ఇది కొరటాల శివ సినిమా. మిర్చీతో తనకు లైఫ్ ఇచ్చింది కొరటాలనే. అలాంటప్పుడు సంపత్ పారితోషికం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ… సంపత్ మాత్రం అడిగినంత ఇవ్వాల్సిందే అనడంతో చిత్రబృందం షాక్ కి గురైంది. ఇప్పుడు సంపత్‌ని ఉంచాలా? లేదంటే తన ప్లేస్ లో మరో నటుడ్ని తీసుకోవాలా అనే విషయంలో నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కొరటాల మాత్రం తన పాత్రకు సంపత్ అయితేనే న్యాయం చేస్తాడని చెబుతున్నాడట. మరి దర్శకుడి కోసమైనా అడిగినంత ఇచ్చి, సంపత్ ని తీసుకోవాల్సిందే. ఆయన డిమాండ్ అలా వుంది మరి.