అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో… పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవబోతున్నాయి. దీని కోసం ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. మొదటగా.. 450 మద్యం దుకాణాలను.. ప్రయోగాత్మకంగా.. ఈ నెల నుంచే ప్రారంభించింది. పదమూడు జిల్లాల్లో ఉన్న ఈ 450 మద్యం దుకాణాల్లో… ట్రయల్ రన్‌గా మద్యాన్ని అమ్ముతారు. వీటిలో ప్రైవేటు వ్యక్తుల్ని నియమించారు. మద్యం దుకాణాల్లో పని చేసే వారి ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సూపర్ వైజర్, హెల్పర్, మరో కింది స్థాయి ఉద్యోగి వీటిలో ఉంటారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మకాలు ఉంటాయి. పర్యవేక్షణకు ప్రతిషాపులోనూ ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను నియమించారు.
అయితే.. సాధారణంగా ఎప్పుడు మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. 90 శాతం షాపుల వద్ద నిరసనలు జరుగుతూ ఉంటాయి. తమ ఇళ్ల వద్ద మద్యం షాపులు వద్దని… ప్రజలు ఆందోళనలు చేస్తారు. ఆ నిరసనలు.. ప్రభుత్వ మద్యం దుకాణాలకు కూడా తాకాయి. జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దంటూ పలు జిల్లాల్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కారణంగా కొన్ని చోట్ల వాటిని ప్రారంభించడానికి కూడా అధికారులు వెనుకాడారు. కొన్ని చోట్ల షాపులు దొరకకపోవడంతో.. బెల్ట్ షాపులు నడిపిన చోటనే దుకాణాలు పెట్టే ప్రయత్నం చేయడం మరింత వివాదాస్పదమయింది.
ప్రైవేటు వ్యక్తులు మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే… ప్రజల ఆందోళనలు చేసినప్పుడు.. పట్టించుకోకపోతే.. ఓ లెక్క. కానీ.. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే.. మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. అదీ కూడా.. సంపూర్ణ మద్య నిషేధం తమ విధానమని సర్కార్ చెబుతోంది. ఇలాంటి సందర్భంలో… మద్యం దుకాణాలు ఏర్పాటుకు… ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే… ప్రభుత్వం గుడ్డిగా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. అలా అని దుకాణాలు పెట్టకపోతే… ఆదాయం పడిపోతుంది. ఈ విషయంలో ఏపీ సర్కార్ కు.. ముందు ముందు గడ్డు కాలమే ఉందని చెప్పుకోవాలి.