ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ తో సూపర్ హిట్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఆ వెంటనే `అఖండ 2` షూటింగ్ లో బిజీ అయిపోయారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాలయ్య – బోయపాటి కాంబో అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా అఖండ కు సీక్వెల్ ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటున్నారు. నటీనటుల ఎంపికలోనూ ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కథానాయికగా సంయుక్త మీనన్ ని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం. అయితే ఇది రెగ్యులర్ కథానాయిక పాత్ర కాదని సమాచారం. సంయుక్తకు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కిందని తెలుస్తోంది.
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ ఘట్టాల్ని రూపొందించారు. మహా కుంభమేళాకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తీసుకొన్నారు. ఈనెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. బాలకృష్ణ కూడా ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. బోయపాటి ఈ సినిమాని మామూలుగా తీయడం లేదని, ఫస్టాఫ్‌కే డబ్బులు గిట్టుబాటు అయిపోయే ఫుటేజీ ఇచ్చారని తమన్ ఓ సందర్భంలో చెప్పారు. దాన్ని బట్టి – బోయపాటి ఈ సినిమాని ఏ స్థాయిలో తీస్తున్నాడో ఊహించుకోవొచ్చు. ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.