నిర్మాణ సంస్థలకు అచ్చొచ్చిన హీరోలు ఉంటారు. ఒక్కో బ్యానర్.. కొంతమంది హీరోలకే పరిమితం అవుతుంటుంది. వాళ్లతో పదే పదే సినిమాలు చేస్తుంటుంది. అయితే ఇదే సెంటిమెంట్ హీరోయిన్ల విషయంలో పెద్దగా ఉండదు. ఎవరు అందుబాటులో ఉంటే, వాళ్లతో ప్రొసీడ్ అవుతుంటారు. కాకపోతే.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు సంయుక్త మీనన్ సెంటిమెంట్ గా మారిపోతోందేమో అనిపిస్తోంది. సితార తీసిన ‘భీమ్లా నాయక్’, ‘సార్’ సినిమాల్లో సంయుక్త కథానాయికగా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ సంస్థలో సంయుక్త పని చేయబోతున్నట్టు టాక్.
సూర్య – వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్తని ఎంచుకొన్నారని వార్తలొస్తున్నాయి. ఇది వరకు హీరోయిన్ పోస్ట్ కోసం భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహార్ పేర్లు గట్టిగా వినిపించాయి. ఇప్పుడైతే.. సంయుక్త ఖాయం అంటున్నారు. అదే జరిగితే.. సితారలో సంయుక్తకు ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది.
‘లక్కీ భాస్కర్’తో ఓ హిట్టు కొట్టాడు వెంకీ అట్లూరి. అది కూడా సితార సంస్థలో నిర్మించిన చిత్రమే. ఇప్పుడు అదే బ్యానర్లో వెంకీ కూడా మరో సినిమా చేయబోతున్నాడు. చిరంజీవికి కూడా వెంకీ ఓ కథ చెప్పాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా సితార సంస్థే నిర్మించబోతోంది. ఆ లెక్కన వెంకీ అట్లూరి కూడా సితారలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడన్నమాట.