తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ హడావుడి తెలంగాణలో కాదు. ఆంధ్రప్రదేశ్‌లో. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిందని… తన నియోజకవర్గంలో.. టీడీపీ ఓట్లను కాంగ్రెస్‌కు వేయించేందుకు చంద్రబాబు, బాలకృష్ణ ప్రచారం చేశారని… తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. టీడీపీలో ఉన్న తన బంధువులను అడ్డం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేశారు. గీతదాటిన విమర్శలు చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామన్నారు. తీరా సనత్ నగర్ ప్రజలు ఆయనకే రివర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ దెబ్బకి ఆయన మంత్రి పదవి కూడా ప్రమాదంలో పడింది.
చంద్రబాబుపై దృష్టి పెట్టి కుమారుడ్ని ఓడించుకున్న తలసాని..!
చంద్రబాబుపై దూకుడుగా వెళ్లి…కేసీఆర్‌ను మెప్పించి మంత్రి పదవి దక్కించుకున్న తలసాని.. వెంటనే.. సికింద్రాబాద్ నుంచి తన కుమారుడికి లోక్‌సభ టిక్కెట్ కూడా ఇప్పించుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వెల్లువ… తన కుమారుడికి కూడా వస్తుందని..ఆశ పడ్డారు. అయితే.. ఆదంతా ఆటోమేటిక్ అని అనుకున్నారేమో కానీ.. చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టి… తన కుమారుడిపై దృష్టి పెట్టడం తగ్గించినట్లున్నారు. ఘోర పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. ఆ పరాజయం కూడా.. తన నియోజకవర్గం సనత్‌నగర్ వల్లే వచ్చింది. ఇదే తలసానికి అసలు రివర్స్ గిఫ్ట్.
ఆరు నెలల్లో సనత్‌నగర్‌లో యాభై వేల ఓట్ల తేడా..!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి.. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిపై కిషన్ రెడ్డి దాదాపుగా యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ యాభై వేల ఓట్ల తేడా… సనత్ నగర్ నుంచే వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో… తలసాని సనత్ నగర్ నుంచి పోటీ చేసి.. 35వే ల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి… ఆ 35వేల ఓట్ల ఆధిక్యం కరిగిపోయింది. ఇంకా.. బీజేపీకి 15వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. అంటే.. మొత్తంగా… మెజార్టీ 35వేలు పోను… ఎక్స్ట్రా 15వేల మంది బీజేపీ వైపు మళ్లారు. అంటే.. ఆరు నెలల్లో.. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గంలోనే.. యాభై వేల మంది ప్రజలు… తలసానికి దూరమయ్యారు. రిటర్న్ గిఫ్ట్ రాజకీయాల్లో పడి.. తలసాని… తనకు సనత్ నగర్ ప్రజలు రివర్స్ గిఫ్ట్ ఇస్తున్నారనే సంగతిని అంచనా వేయలేకపోయారు.
ఊస్టింగ్ మంత్రుల జాబితాలో తలసాని..?
తామే బాధ్యత తీసుకుంటామని గొప్పలు చెప్పుకుని టిక్కెట్లు పొందిన లేదా ఇప్పించుకున్న నేతలు.. టీఆర్ఎస్ క్రేజ్‌తో గెలిచేసి.. తమ గొప్పగా… కేసీఆర్ వద్ద డాబు కొట్టాలనుకున్నారు. అలాంటి వారిలో తలసాని మొదటి వరుసలో ఉన్నారు. ఇలాంటి వారిపై కేసీఆర్ ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకుని.. తన సొంత నియోజకవర్గంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని కూడా తెప్పించుకోలేక.. మరింత మైనస్‌లోకి పడిపోయిన తలసానిపై… కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు తాను కన్నెర్ర చేయకపోతే… పార్టీలో.. నిర్లక్ష్యం చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే… కేసీఆర్ గురిపెట్టిన మంత్రుల జాబితాలో తలసాని కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తలసాని మంత్రి పదవి ఊడిపోతే … చంద్రబాబు సంగతేమో కానీ… తలసానికి మాత్రం రివర్స్ గిఫ్ట్ అందినట్లే..!