సింహాచలం అప్పన్న ఆలయం… వివాదాస్పద అంశాలతో ఇటీవలి కాలంలో హైలెట్ అవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా… తొలి సారి నిజరూపదర్శనం.. ఓ మహిళ చేసుకున్నారు. అది సంప్రదాయాల పరంగా వివాదాస్పదం కాగా.. ఇప్పుడు.. ఆలయ నిర్వహణలోనూ.. ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆలయం ఓ ప్రైవేటు వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఆ ప్రైవేటు వ్యక్తిని సంచయిత తీసుకొచ్చారు. ఎలాంటి పదవి ఇవ్వకుండా మొత్తం వ్యవహారాలు ఆయన కనుసన్నల్లో జరగాలని ఆదేశించారు. ఆ వ్యక్తి పేరు కార్తీక సుందర రాజన్. ప్రభుత్వ ఉద్యోగి కాదు. కనీసం నామినెటెడ్ పోస్ట్ కూడా లేదు.
అయినా సింహాచలం కొండపై ఉన్న అన్నపూర్ణ ఏసి కాటేజీలో మే 30వ తేదీ నుండి ఉంటున్నారు. ఆయనకు ఆలయ నిధులతోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్ పర్సన్ చెప్పారంటూ ఆలయానికి సంబంధించిన పరిపాలన, భూ విభాగాల రికార్డులను తన వద్దకు తెప్పించుకుని సుందర రాజన్ పరిశీలన చేస్తున్నారు. కార్తీక్ వ్యక్తిగత ఖర్చులు ఆలయ నిధుల నుంచి వెచ్చిస్తున్నారు. ఆలయ భూ పరిరక్షణ విభాగానికి ఉన్న వాహనాన్ని అవసరం ఉన్నప్పుడల్లా సుందర రాజన్ వాడుకుంటున్నారు. వంట, తదితర పనులకు ఆలయానికి చెందిన ఐదుగురు సిబ్బందిని సుందర రాజన్ కోసం వినియోగిస్తున్నారు.
ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్.. సింహాచలం ఆలయ భూములపై కన్నేసి.. సంచయితను అక్రమంగా ట్రస్ట్ చైర్‌పర్సన్‌ను చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది నిజమో కాదో కానీ.. భూములకు సంబంధించి వివాదాస్పద నిర్ణయాలు తరచూ తీసుకుంటున్నారు. దీంతో నిన్నామొన్నటిదాకా ఆలయ ఈవో ఉన్న భ్రమరాంబ.. ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వానికి లేఖ రూపంలో చెప్పి.. బదిలీ చేయించేసుకున్నారు. ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది కానీ.. ఈ ప్రైవేటు వ్యక్తి గురించి మాత్రం పట్టించుకోలేదు. సంచయిత నియమించిన అనధికారిక వ్యక్తి సింహాచలం ఆలయాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయననే సంచయిత ఓఎస్డీగా నియమిస్తారని అంటున్నారు. అయితే.. అలాంటి నియామకాలు చెల్లవన్న ప్రచారం కూడా ఉంది.