ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కుంభకోణాలు.. వివాదాలు కేరాఫ్ అయిపోయింది. సామాన్యులకు దొరకడం సంగతేమో కానీ ఇసుక కేంద్రంగా జరుగుతున్న దందాలపై మాత్రం తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణాన్ని కూడా పట్టించుకోకుండా తవ్వుకెళ్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏపీలో ఇసుక మొత్తం జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఆ కంపెనీ ఇసుక తవ్వుకోవడం ప్రారంభించారు. ఎక్కడా ఎన్జీటీ నిబంధనలు పాటించడం లేదు. నదీ గర్భాల్లో కూడా యంత్రాలను తీసుకెళ్లి తవ్వుకొస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో నదీ గర్భంలో ఏకంగా 150 లారీలు వరదలో చిక్కుకున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్తం చేసుకోవచ్చు.
హఠాత్తుగా వరద వచ్చింది కాబట్టి ఆ విషయం బయటపడింది లేకపోతే..బయటకు వచ్చేది కాదు. అనేక చోట్ల అంతే ఉంది. ఆ ఇసుక అంతా ఎటు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. వినియోగదారులు బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చెప్పే రేటుకు.. అమ్మే రేటుకు పొంతన ఉండటం లేదు. అదే సమయంలో కొత్త కొత్త స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీఎంవో కార్యాలయం ఆదేశంతో సుధాకర్ ఇన్ఫ్రా అనే కంపెనీకి గోదావరిలో ఇసుక తవ్వకం కాంట్రాక్ట్ ఇచ్చారని టీడీపీ లేఖలు బయట పెట్టింది. ఈ సుధాకర్ ఇన్ ఫ్రా కంపెనీపై జూన్ 4న విజయవాడలో కేసు నమోదైంది. ఇసుక కాంట్రాక్టులిస్తామని ఆ సంస్థ మోసం చేస్తోందని ఇసుక తవ్వకం కంపెనీనే ఫిర్యాదు చేసింది.
ఇప్పుడు అదే కంపెనీకి నేరుగా సీఎంవో నుంచి సిఫార్సుతో కాంట్రాక్ట్ లభించింది. ఒక ప్రైవేటు కంపెనీ సీఎంకు లేఖ రాయగానే అధికారులు వెంటనే ఆదేశాలు ఇస్తారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇసుక దోపిడిలో ముఖ్యమంత్రి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఏపీలో రవాణా చార్జీలతో ఇసుక లభించేంది. కానీ ఇప్పుడు రవాణా చార్జీలు.. ఇసుక చార్జీలు కూడా రెట్టింపయ్యాయి. ఎక్కువగా బ్లాక్‌లోనే కోనుగోలు చేయాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ఇసుకపై అసలునిఘా లేకుండా పోయింది. మొత్తంగా ఇసుక విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.