వైసీపీ సర్కార్కు కూడా ఇసుక దడ పుట్టిస్తోంది. గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం తీసేసి కొత్త విధానం తెచ్చినప్పటి నుండి ఏపీలో ఇసుక బంగారం అయిపోయింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ కారణంగా ఇసుక పాలసీని మళ్లీ మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా ధర పెట్టి.. టోకెన్లు పెట్టి.. అమ్మకాలు జరపొచ్చని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ప్రత్యేకంగా కొత్త ఇసుక విధానంపై సీఎం సమీక్ష చేశారు. త్వరలో పద్దతి మారబోతోందని సంకేతాలు పంపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలని సీఎం జగన్ సూచించారు.
ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ దారుణంగా ఉండటం… పార్టీ నేతలు.. ఇసుకను దోచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతూండటంతో ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఏర్పడుతోంది. అందుకే తక్షణం ఇసుక విధానాన్ని సంస్కరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇసుక రేటు భారీగా ఉంది. దాన్ని తగ్గించాలని సీఎం జగన్ అధికారులకు సూచిస్తున్నారు. ఏ రేటుకు అమ్మాలన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ చేయాలని…ఆదేశించారు. ప్రస్తుతం ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధం కోసం ఎస్ఈబీని ఏర్పాటు చేశారు.
ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఇసుకను తీసుకెళ్తున్న వారిపైనా… కేసులు పెడుతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మూడు రోజుల క్రితం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన హల్ చల్ కలకలం రేపింది. ఈ క్రమంలో… ఇసుక విషయంలో.. ఏదో ఒకటిచేయకపోతే.. మొత్తానికే మోసం వస్తుందని..ప్రభుత్వం అంచనాకు వచ్చింది.