ఆంధ్రప్రదేశ్లో ఇసుక మొత్తం ఒకే కంపెనీకి కట్టబెట్టడంపై దుమరం రేగుతోంది. విపక్ష పార్టీలన్నీ ఇసుకను క్విడ్ ప్రో కో కింద జగన్మోహన్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీలకు కట్టబెట్టారని… లింకులు వెదికి మరీ ఆరోపణలు చేస్తున్నాయి. అసలు ఇసుక తవ్వకాల్లో అనుభవం లేని కంపెనీ… వేల కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీకి ఎందుకు టెండర్ కట్టబెట్టాల్సి ఉంటుదని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల టన్నుల ఇసుక తవ్వే కంపెనీకి తొమ్మిది లక్షల టన్నుల ఖనిజం తవ్విన అనుభవం ఉంటే చాలని ఎందుకు నిబంధన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. తమపై వస్తున్న ఆరోపణలపై… అధికారులతో సమాధానం ఇప్పిస్తోంది. ప్రజాధనం పెట్టి ప్రకటనలు ఇస్తోంది. కానీ అందులో విపక్షాలు మౌలికంగా లేవనెత్తుతున్న అనుమానాలేమీ తీర్చడం లేదు.
ప్రైవేటుకు ఇసుక అప్పగింతలో ఎన్నెన్నో ఆరోపణలు..!
ఇసుకను ఏక మొత్తంగా ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడం…రెండేళ్లకు కలిపి ప్రభుత్వానికి ఏడెనిమిది వందల కోట్ల చిల్లర మాత్రమే వస్తూండటంతో విపక్షాలు తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నాయి. లెక్కలు చెప్పి మరీ ప్రశ్నలు సంధిస్తున్నాయి. దీంతో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ మీడియా ముందుకు వచ్చి విపక్షాల ఆరోపణలకు సమాధానాలు చెప్పారు. ఆయన ఆ ప్రైవేటు కంపెనీపై ఎక్కడా లేనంత ప్రేమ ఒలకబోశారు. ఎంత చేసినా ఆ కంపెనీకి రూ. 70కోట్లే మిగులుతాయన్నారు. అయితే ద్వివేదీ చెప్పిన లెక్క ప్రకారం.. ఏడాదికి రెండు కోట్ల టన్నుల ఇసుక తీస్తేనే అంత. టీడీపీ నేతలు.. అంత మొత్తం తీస్తారన్న నమ్మకం ఏమిటని… అనధికారికంగా మరో రెండు కోట్ల టన్నుల ఇసుకను దోపిడీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం రోజువారీగా ఏపీలో తవ్వుతున్నఇసుక లెక్కలను వారు చెబుతున్నారు.
నేరుగా సమాధానం ఇవ్వకుండా రూ. కోట్లతో పేపర్ ప్రకటనలు..!
విపక్షాల లేవనెత్తిన సందేహాలు.. చేస్తున్న ఆరోపణలపై సరైన సమాధానాలు దొర్కకపోవడంతో.. ప్రభుత్వం పేపర్ ప్రకటన ఇచ్చింది. పెద్ద ఎత్తున ఖర్చు చేసి.. మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. అంతా ప్రజల కోసమే చేస్తున్నామని… మెరుగైన విధానంతో ఇసుక అందుబాటులోకి తెస్తున్నామని కానీ ప్రతిపక్షాలు.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. అట… అట అంటూ.. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఇచ్చిన వివరాల్లోనూ విపక్షాలు లేవనెత్తిన అంశాలపై స్పష్టత లేదు. కొసమెరుపేమిటంటే.. గతంలో… ఆన్ లైన్ ద్వారా ఇసుక.. ఇంటి వద్దకే ఇసుక పంపిణీ కూడా అద్భుతమైనదని.. విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని.. పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించినా కూడా.. అదే తరహా ప్రకటనలు కోట్లు ఖర్చు చేసి ఇస్తున్నారు.
మెరుగైన పాలసీలు అయితే ఇన్ని సార్లు ఎందుకు మార్చాలి..!?
ఇసుక విషయంలో ఇప్పటి ఏపీ సర్కార్కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. రవాణా ఖర్చులు మాత్రం పెట్టుకునేవారు. ఎప్పుడూ ఇసుక బ్లాక్ అనే మాట వినిపించలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక బంగారం అయిపోయింది. ధర అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో… ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి… ఒకే ప్రైవేటు కంపెనీకి మొత్తం కాంట్రాక్ట్ కట్టబెట్టేసి.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిపై తప్పుడు ప్రచారం అనేముద్ర వేసి సరి పెడుతున్నారు. ఇది ప్రజల్లో మరిన్ని అనుమానాలకు కారణం అవుతోంది.