కొత్తగా అధికారం చేపట్టిన పార్టీకి… మొదటి ఏడాది, రెండేళ్లు… తిరుగు ఉండదు. అదీ కూడా.. తిరుగులేని మెజార్టీ సాధించిన పార్టీని విపక్షాలు కూడా విమర్శించడానికి వెనుకాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. విపక్ష పార్టీలకు ముందుగానే కావాల్సినన్ని అస్త్రాలు ఇచ్చింది. దాంతో.. వారు రోడ్డెక్కారు. రోజుకో ఆందోళనతో… ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ ఆందోళనలకు వైసీపీ సర్కార్ కుట్ర సిద్ధాంతాన్ని జోడిస్తుందే తప్ప.. సమస్యకు పరిష్కారాన్ని మాత్రం అన్వేషించడం లేదనే వాదన వినిపిస్తున్నాయి. ఇసుక సమస్య.. ఏపీ ఆర్థిక పరిస్థితిని ఓ రకంగా దిగజార్చింది. నిర్మాణ రంగం కుప్పకూలిపోవడంతో.. అన్ని రంగాలు వృద్ధిలో వెనుకబడిపోయాయి. ఈ వ్యవహారం… రాష్ట్ర ఆదాయంపై పడినట్లు నేరగా అధికారులు ముఖ్యమంత్రికే వివరించారు.
అయినప్పటికీ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఇసుక విషయంలో.. అంత తొందరేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఫలితంగా… ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారికి మాత్రమే గత మూడు నెలలుగా… స్వర్ణయుగం నడుస్తోంది. ఇక ఆ రంగంపై ఆధారపడిన వారికి మాత్రం గడ్డు కాలం నడుస్తోంది. కూలీలు అయితే… రోజువారీ ఉపాధిని కోల్పోయి తంటాలు పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షం టీడీపీ బాగానే ఉపయోగించుకుంటోంది. ఇసుకపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఇసుక విషయంలో ఉన్న అసంతృప్తి.. టీడీపీ నిరసనలతో బయట పెట్టే ప్రయత్నం చేసింది.
ఈ విషయంలో.. ఏపీ సర్కార్ కూడా.. ఆందోళనకరంగానే ఉంది. అందుకే… ఇసుక విషయంలో ధర్నాలకు పిలుపునిచ్చిన వెంటనే… టీడీపీ నేతల్ని… నిర్బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతల్ని ఇంటి నుండి కదలకుండా… ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నాలకు వెళ్లనీయలేదు. ఓ వైపు.. కమ్యూనిస్టు పార్టీలు కూడా.. రోజూ కూలీలతో నిరసన ప్రదర్శనలు.. ఎక్కడో చోట చేస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో… ఇసుక విషయంలో… ఏపీ సర్కార్ కు సెగ గట్టిగానే తలుగుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. గతంలో ఏపీ సర్కార్.. ఇలాంటి ఇసుక విధానం వల్లే.. చెడ్డ పేరు తెచ్చుకుంది. చివరికి ఉచితంగా ఇచ్చినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు.. వైసీపీ సర్కార్ తీరు చూస్తూంటే… పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని… నిర్మాణదారులు ఆవేదన చెందుతున్నారు.