ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు వంద రోజుల సమయం ఇస్తున్నామని.. ఆ తర్వాత స్పందిస్తామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై జనసేన ఇంత వరకూ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. దానిపైనే.. పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీకి కొత్త గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన.. బిశ్వభూషణ్ హరిచందన్‌ను.. ఇతర పార్టీ నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాల గురించి బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గవర్నర్‌తో చర్చించారు.
ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. వైసీపీ సర్కార్ పనితీరుపై..స్పందించడానికి వంద రోజుల గడువు పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. పాలనను అర్థం చేసుకోవడానికి జగన్‌కు కొంత సమయం ఇవ్వాలని ..పాలన సరిగా లేకుంటే నిలదీస్తాం.. ప్రశ్నిస్తాం.. పోరాడతామని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఇసుక కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇసుక లేకపోవడం వల్ల తమ పార్టీ కార్యాలయ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. పాతికేళ్ల తర్వాత పరిస్థితి ఏంటన్న ఆలోచనే రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని..ఎన్నో ఓటములను తట్టుకొని నిలబడ్డాం..ఒక్క ఓటమి కుంగదీస్తుందా?.. అని కార్యకర్తలను ప్రశ్నించారు.
టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే నేరుగా పెట్టుకునే ధైర్యం ఉన్న వ్యక్తినన్నారు. దొంగచాటు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని ప్రకటించారు. రాజకీయ పార్టీ నడపడం సులువైన పని కాదని .. విమర్శిస్తున్నా సరే నిలబడ్డానంటే..రాజకీయ వ్యవస్థ మార్పు కోసమేనని పవన్ ప్రకటించారు. జనసైనికులపై దాడులు జరిగితే సహించేది లేదని … జనసైనికులకు అండగా ఉంటా..ఎవరూ భయపడవద్దని అందరికీ ధైర్యం చెప్పారు.