తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ హాట్ కామెంట్స్ చేశారు. పీఆర్ వ్యవస్థ గురించీ, ఫేక్ కలక్షన్ల గురించీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ”ఓ సినిమా విడుదలై ఓకే ఓకే గా ఆడుతున్నప్పుడు ఆ సినిమాకి నేనే నిర్మాతని, నేనే డిస్టిబ్యూటర్ని అయినప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అని పదిమంది పెద్దోళ్లతో చెప్పిస్తున్నా. డబ్బులు వచ్చాయని చూపిస్తున్నా. మీకూ నాకూ తెలుసు. ఎంతొచ్చాయో? కానీ ఆడియన్ మాత్రం హిట్టనే కదా, నమ్ముతాడు. వందలో నలభై మంది `ఇది టూమచ్` అనుకొన్నా, కనీసం అరవై శాతం కన్వెన్స్ అవుతారు. పోస్టర్‌పై వేసిందాంట్లో సగమైనా చేసి ఉంటుంది కదా? అదైనా మంచి నెంబరే కదా అనుకొంటారు. వాళ్ల దగ్గర ఓ సోషల్ మీడియా బాంబ్ ఉంటుంది. వాళ్లు ఏదైనా పోస్ట్ వేస్తే, సపోర్ట్ చేయడానికి వంద మంది ఉంటారు. నెగిటీవ్ పోస్ట్ చేస్తే తిట్టడానికి రెండొందలమంది ఉంటారు. ఇక్కడ నిజమైనా చెప్పాలి, లేదంటే ఓ అబద్ధాన్ని నిజం అని నమ్మించడానికి వందమందైనా ఉండాలి” అంటూ స్ట్రయిట్ గా ఎటాక్ చేశాడు సందీప్.
ఇటీవల నిర్మాతలు విడుదల చేస్తున్న కలక్షన్ పోస్టర్లకూ, అసలు అంకెలకూ సంబంధమే ఉండడం లేదు. దీనిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఫేక్ కలక్షన్లతో ఎవరిని మోసం చేద్దామని? అని అభిమానులే నేరుగా ప్రశ్నిస్తున్నాం. పోస్టర్లలో అన్నీ అబద్ధాలే ఉంటాయని, ఆ కలక్షని నమ్మొద్దని, అసలు ఎంత వచ్చిందో మాకే తెలుసని… ఓ టాప్ ప్రొడ్యూసర్ కూడా కుండ బద్దలు కొట్టారు. అభిమానుల కోసమే ఈ అంకెలని బడా నిర్మాత సెలవిచ్చాడు. అయినా సరే ఈ ఫేక్ ప్రచారాలు ఆగడం లేదు. ఇప్పుడు సందీప్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. సోషల్ మీడియానో, మీడియాలోని ఓ వర్గాన్నో అడ్డుపెట్టుకొని రాని కలక్షన్లు వచ్చినట్టు డప్పు కొంటున్నారన్నది సందీప్ మాట. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ‘సందీప్ చెప్పింది మీ హీరో గురించే’ అని మిగిలిన హీరోల అభిమానులు సోషల్ మీడియాలో జోరుగా పోస్టింగులు చేసుకొంటున్నారు. పీఆర్ వ్యవస్థపై ఇటీవల నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇప్పుడు సందీప్ కూడా అదే మాట చెప్పడం టాలీవుడ్ లో పరిస్థితికి అద్దం పడుతోంది.