సందీప్ కిషన్ మంచి క్యాలిబర్ వున్న నటుడు. కొత్త కథలు చెప్పాలని ప్రయత్నిస్తాడు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. అయితే ఇప్పటికీ సందీప్ కి సరైన కమర్శియల్ బ్రేక్ రాలేదనే మాట వినిపిస్తుంటుంది. కానీ నటుడిగా మాత్రం సందీప్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.
తెలుగులో ఎంత పేరు తెచ్చుకున్నాడో తమిళ్ లో కూడా మంచి నటుడిగా నిలబడ్డాడు సందీప్. ఇప్పుడు రచ్చ గెలిచాడు. నటుడిగా అక్కడ ఎంత ప్రభావం చూపాడంటే అగ్ర హీరో విజయ్, తన కుమారుడు జేసన్ సంజయ్ ని దర్శకుడిగా లాంచ్ చేయించడానికి సందీప్ కిషన్ ని హీరోగా ఎంచుకున్నారు. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు.
మొదటి నుంచి సందీప్ కిషన్ తమిళ పరిశ్రమపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. లోకేష్ కనకరాజ్ కు లాంచింగ్ పాడ్ గా నిలిచిన నగరం సినిమాలో సందీక్ కిషనే మెయిన్ లీడ్. మంచి ప్రతిభ వున్న దర్శకులతో పని చేయడంలో సందీప్ కి మంచి ట్రాక్ రికార్డ్ వుంది. ధనుష్ లాంటి నటుడు తన సినిమాల్లో ఏరికోరి సందీప్ కిషన్ కి మంచి పాత్రలు ఇస్తుంటారు.
విజయ్ అనుకుంటే తమిళ్ లో స్టార్ హీరోలు జేసన్ కి డేట్స్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ జేసన్, సందీప్ లాంటి ప్రతిభ వున్న నటుడితోనే లాంచ్ అవ్వడానికి ఇష్టపడ్డారు. విజయ్ కొడుకు మొదటి సినిమా అంటే ఖచ్చితంగా అందరి ద్రుష్టి వుంటుంది. ఇప్పుడీ అధికారక ప్రకటన వెలువడిన తర్వాత తమిళనాట హెడ్ లైన్స్ లో నిలిచాడు సందీప్. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.