ప్రతిభావంతమైన యువ కథానాయకుల జాబితాలో సందీప్ కిషన్ పేరు తప్పకుండా ఉంటుంది. తన కథల ఎంపిక విమర్శకుల్ని సైతం మెప్పిస్తుంది. రెగ్యులర్ ఫార్మెట్కు దూరంగా ఉన్న సినిమాల్ని ఎంచుకొంటుంటాడు. అఫ్ కోర్స్… ఒక్కోసారి అవే భారీ ఫ్లాపులు ఇస్తుంటాయి. ఒక్క అమ్మాయి తప్ప సినిమాలా! అయితే… సందీప్ కిషన్ మాత్రం తన ప్రయత్నాల్ని మానలేదు. తన నుంచి వచ్చిన మరో విభిన్నమైన చిత్రం నగరం. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది? సందీప్ కిషన్ నమ్ముకొన్న కొత్తదనం.. అతనికి విజయాన్ని అందిస్తుందా, లేదా?
కథ
పేరుకి తగ్గట్టుగా ఓ నగరంలో జరిగే కథ ఇది. సందీప్ కిషన్ కి ఉద్యోగం లేదు. రెజీనాని గాఢంగా ప్రేమిస్తుంటాడు. తాను మాత్రం సందీప్‌ని పట్టించుకోనట్టే వ్యవహరిస్తుంటుంది. రెజీనా కోసమే ఓ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకొంటాడు సందీప్. అదే నగరంలో ఉద్యోగం కోసం వస్తాడుశ్రీ. తనకు ఇష్టం లేకపోయినా ప్రేమించిన అమ్మాయి కోసం ఉద్యోగంలో ఉండక తప్పదు. అనుకోకుండా ఓ దాదా కొడుకుని కిడ్నాప్ చేసి ఇరుకున పడుతుంది ఓ ఛోటా గ్యాంగ్. తన కొడుకు ఆపరేషన్ కోసం టాక్సీ నడుపుకొంటూ డబ్బులు సంపాదించాలని అనుకొనే ఓ మధ్యతరగతి మనిషి. వీళ్ల చుట్టూ నడిచే కథ ఇది. కిడ్నాప్ కీ ఈ నలుగురి జీవితాలకూ పడిన లింకేంటి?? అందులోంచి ఎలా బయటపడ్డారు? అనేదే కథ.
విశ్లేషణ
కథ మాట ఎలా ఉన్నా.. ఆ కథని నడిపించడానికి దర్శకుడు అల్లుకొన్న సంఘటనలు, వేసుకొన్న చిక్కుముడులూ.. `నగరం`ని ముందుండి నడిపిస్తాయి. రోజూ మనం చూసే పాత్రలు, సంఘటనలే కళ్ల ముందు కదలాడడంతో సినిమా చూస్తున్నామన్న భావనే రాదు. నాలుగైదు జీవితాల్ని ఓ చోటకు చేర్చి స్క్రీన్ ప్లే అల్లడం… `వేదం` సినిమాలో చూశాం. ఇదీ అలాంటి గమ్మత్తైన కథనమే. కాకపోతే ఇక్కడ దర్శకుడు చెప్పాలనుకొన్న విషయాలెక్కువ. చర్చించాలనుకొన్న సంగతలెక్కువ. ఇలాంటి కథ చెప్పాలంటే.. చాలా నేర్పు కావాలి. దర్శకుడిలో అది కనిపించింది. ఇంత క్లిష్టమైన సబ్జెక్ట్‌ని భలే చెప్పాడే అనిపిస్తుంది. తాను ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా.. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్లోకి నెట్టకుండా అతి జాగ్రత్తగా స్ర్కీన్ ప్లే రాసుకొన్నాడు. సంఘటనల్ని, పాత్రల్నీ ఒకే థ్రెడ్ మీదకు తీసుకురావడంతోనే… దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. సూటిగా, సుత్తి లేకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయిన విధానం, ప్రధాన పాత్రల్ని బిల్డప్పులు లేకుండా పరిచయం చేసిన పద్ధతి ఆకట్టుకొంటాయి. ఇలాంటి కథకు కావల్సింది అదే. అప్పుడే… ప్రేక్షకుడు పాత్రని పాత్రలానే గుర్తు పెట్టుకొంటాడు.
అనవసరమైన వినోదానికీ, పాటలకూ ఎక్కడా చోటివ్వలేదు దర్శకుడు. నిజానికి తనకంత టైమ్ లేదు. ఉన్నంతలో చాలా విషయాలు చెప్పాలి కాబట్టి.. `సోది` ని ముందే ఎడిట్ చేసుకొనే సౌలభ్యం దక్కింది. రెజీనా ఉంది కదా అని పాటలు పెట్టకుండా.. ఆ పాత్రని పెంచకుండా మంచి పని చేశాడు. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. దర్శకుడు మరీ డిటైలింగ్కి పోతున్నాడేమో అనే భావన కూడా కలుగుతుంది. పాత్రల్ని మరీ డీగ్లామర్‌గా చూపించడం మన ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో తెలీదు. ద్విభాషా చిత్రం అని చెప్పుకొంటున్నారు గానీ… తమిళంలో తీసిన సినిమా ఇది. ఆ ఫ్లేవర్ అడుగడుగునా కనిపిస్తుంది. `రా`గా తీసేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. మరీ అంత ఘాటుగా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నా.. ఈ సినిమా స్థాయిని పెంచడానికి అవి సరిపోలేదు. నిజంగా మనసు మెలేసే ఓ ముగింపు అందిస్తే… `నగరం` తప్పకుండా గుర్తుండిపోయే సినిమా అవుదును. మధ్యమధ్యలో సొంత ఊరి గురించి చెప్పిన సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఎవరి ఊరు వాడికి గొప్ప.. ఊర్లో కొన్ని మైనన్సులు ఉండొచ్చు. కానీ పొట్ట నింపేది. మన ఉనికిని చాటేది.. మన ఊరేగా.
నటీనటుల ప్రతిభ
సందీప్ కిషన్ నటన మరోసారి ఆకట్టుకొంటుంది. హీరోయిజం చూపించాలని ఎక్కడా ప్రయత్నించలేదు. అలాగని అదేం తగ్గలేదు. తనని తాను డీ గ్లామర్‌గా చూసేందుకు ధైర్యం చేశాడు. హెయిర్ స్టైల్, డ్రస్సింగ్ విధానం చూస్తే సందీప్ కిషన్ పాత్ర కోసం ఎంత తపించాడో అర్థం అవుతుంది. రెజీనా పరిధి తక్కువే. కానీ తాను బాగానే చేసింది. శ్రీ నటన బాగుంది. అయితే.. మనకు పరిచయం ఉన్న నటుడైతే ఇంకా బాగుండేది. కిడ్నాపర్ గ్యాంగ్‌లో అమాయక చక్రవర్తి భలే నవ్వించాడు. తనే కాస్త రిలీఫ్ పంచాడు. ఏ పాత్రా తక్కువ చేయలేదు. అలాగని ఓవర్ యాక్టింగ్ కి పోలేదు. కథ ప్రకారం నడిచారంతే.
సాంకేతిక వర్గం
ఇది కచ్చితంగా దర్శకుడి సినిమా. అతని స్క్రీన్ ప్లే ఈసినిమాకి ప్రాణం. ఇలాంటి కథ చెప్పుకోవడానికి రాసుకోవడానికి బాగానే ఉంటుంది. తెరపై చూపించడం చాలా కష్టం. అయితే.. దర్శకుడు రాసుకొన్న పకడ్బందీ స్క్రిప్టు వల్ల… అనుకొన్న అవుట్ పుట్ వచ్చింది. కెమెరా, నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగానే అమరాయి. సంభాషణలు మరింత ఎఫెక్టీవ్ గా రాసుకోవాల్సింది. మరీ సీరియస్‌గా సాగే సబ్జెక్ట్ కావడంతో ఇది కొంతమందికే పరిమితమయ్యే ప్రయత్నంగా మిగిలిపోవొచ్చు. థ్రిల్లర్స్‌ని, రియలిస్టిక్ మూవీస్నీ ఇష్టపడేవాళ్లకు నగరం కచ్చితంగా బెస్ట్ ఆప్షనే.
ఫైనల్ పంచ్ : నగరం… స్క్రీన్‌ప్లేకి మణిహారం!
తెలుగు360 రేటింగ్: 3