పదిహేనేళ్ల కెరీర్లో విభిన్నమైన ప్రయత్నాలు చేసిన హీరో.. సందీప్ కిషన్. నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు. తెలుగు, తమిళ, హిందీ… ఇలా అన్నిచోట్లా మెరిశాడు. ‘ఫ్యామిలీ మెన్లాం’టి వెబ్ సిరీస్‌లో భాగమయ్యాడు. కొత్త దర్శకుల్ని పరిచయం చేశాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. అయినా సరే – తనకెందుకో దక్కాల్సినంత గుర్తింపు రాలేదు. ఆ అసంతృప్తి తనకూ ఉంది. ఎన్ని హిట్లు ఇచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా, ఇంకా తనకి తాను నిరూపించుకోవడానికీ, నిలదొక్కుకోవడానికీ పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ‘మజాకా’తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ శివరాత్రికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్… తెలుగు 360తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ ఇంటర్వ్యూలోని హైలెట్స్ ఇవీ…
* కథ నచ్చితే, క్యారెక్టర్ నచ్చితే.. ఎలాంటి హోమ్ వర్క్ చేయకుండానే సెట్స్‌కి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా చేసిన సినిమాలు కొన్ని వర్కవుట్ అయ్యాయి కూడా. కెరీర్లో రకరకాల ప్రయత్నాలు చేశాను. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ డ్రామా.. ఇలా అన్నీ చేశాను. కానీ ఎంటర్టైనర్ చేస్తే ఆ హాయి వేరు. ఈ జోనర్‌ని బాగా ఎంజాయ్ చేస్తా. ‘మైఖేల్’లాంటి సినిమాలు చేస్తూ చేస్తూ పోతే సైకలాజికల్ డామేజ్ అయిపోతారు. రెండేళ్ల పాటు ఒకే కథపై వర్క్ చేయడం చాలా కష్టం. ‘మజాకా’లాంటి సినిమాలు ఆడుతూ పాడుతూ చేసేయొచ్చు.
* నక్కిన త్రినాథరావు ఇది వరకు నాకు రెండు కథలు చెప్పారు. అయితే వివిధకారణాల వల్ల అవి వర్కవుట్ అవ్వలేదు. ఈసారి ఈ కథ నాకు తప్ప అందరికీ చెప్పారు. చివరికి నా దగ్గరకు వచ్చింది.
* ఈ సినిమా కథ ముందు చిరంజీవి గారి దగ్గరకు వెళ్లింది. ఆయనోసారి నన్ను పిలిచారు. ‘మంచి కథ బాగా చేయ్’ అని ప్రోత్సహించారు. నేను కూడా ఇలాంటి కథల్లో చిరంజీవిగారిని చూడలేదు. మనం ఆయన్ని వేరేలా ఊహించుకొంటాం కదా.
* ఇన్నేళ్ల నా కెరీర్లో నాకు అర్థమయ్యింది ఏంటంటే.. మనం ఏం చేసినా, మన గురించి మాట్లాడడానికి సరైన పీఆర్ ఉండాలి. మన గురించి ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండాలి. లేదంటే మనం ఎన్ని చేసినా అది జనాలకు రీచ్ కాదు. నిజం చెప్పే ధైర్యం అయినాఉండాలి. లేదంటే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి వంద మందైనా ఉండాలి.
* ఓ సినిమా ప్రమోషన్ కోసం సెలబ్రెటీలను తీసుకురావడం కూడా కష్టమే. నా వరకూ నా ఫ్రెండ్స్ నాకు చేదోడుగా ఉన్నారు. ఓ సినిమా కోసం చిరంజీవిగారు వచ్చారు. ఓ సినిమాకు ప్రభాస్ అన్న సహాయం చేశాడు.
* చిరంజీవి, రజనీకాంత్, పవన్, బన్నీ, ధనుష్, షారుఖ్, బన్నీ.. వీళ్లంతా నా ఆదర్శం. చిరంజీవి, రజనీకాంత్ ఎలాంటి సపోర్ట్ లేకుండా సూపర్ స్టార్లు అయ్యారు. డార్క్ స్కిన్‌తో కూడా చిత్రసీమని ఏలవచ్చని రజనీకాంత్ నిరూపించారు. ధనుష్, పవన్, బన్నీ, విజయ్.. వీళ్ల తొలి సినిమాలో ప్రెజెన్స్కీ, ఇప్పటి స్థాయికీ ఎక్కడా పొంతన లేదు. వాళ్ల ట్రాన్స్ఫర్మేషన్ ఆశ్చర్యపరుస్తుంది.