ప్రస్తుతం దేశమొత్తమ్మీదే పద్ధతైన కథానాయిక అంటే సాయి పల్లవి పేరే చెబుతారంతా. నవ్వులో, చూపులో, మాటలో అంతా స్వచ్ఛతే. కనీసం స్లీవ్ లెస్ కూడా వేయదు. ఎంత పారితోషికం గుప్పించినా – తనకు నచ్చని కథ చేయదు. హీరో ఎవరైనా తన పాత్రని తక్కువ చేస్తే ఊరుకోదు. ఓ సినిమా ఒప్పుకొందంటే, ఆ సినిమా కోసం, ఆ పాత్ర కోసం దర్శకుడి కంటే ఎక్కువ ఆలోచిస్తుంది. ఇన్ని మంచి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టే – అంత పెద్ద హీరోయిన్ అయ్యింది.
ఇలాంటి సాయి పల్లవిని అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో ఊహించగలమా? ఆ సాహసం చేశారు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి కథ రాసుకొనేటప్పుడు కథానాయిక ఎవరు? అన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. సాయి పల్లవి అయితే ఎలా ఉంటుందా? అనే ఆలోచన దగ్గర ఆగారు సందీప్. నిజానికి ఇది బీభత్సమైన ఆలోచనే. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో హాట్ సీన్లు, ముద్దులు అన్ లిమిటెడ్ గా ఉంటాయి. మాట్లాడితే ముద్దు పెట్టేసుకొంటారు హీరో, హీరోయిన్లు. ఇలాంటి ముద్దులు, శృంగారభరిత సన్నివేశాలు ఎన్నో. ఈ తరహా పాత్ర గురించి సాయి పల్లవి కో-ఆర్డినేటర్‌తో చర్చించేటప్పుడు ‘అసలు ఆ అమ్మాయి స్లీవ్ లెస్ డ్రస్సే వేసుకోదు. ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది.. మర్చిపో’ అని సలహా ఇచ్చాడట. ఆ తరవాత ఆ కథ పట్టుకొని సాయి పల్లవి దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేకపోయాడు సందీప్ రెడ్డి.
ఏ కథానాయిక అయినా…. దర్శకుడ్ని బట్టో, ప్రేక్షకుల అభిరుచి బట్టో, మారుతున్న ఇమేజ్‌ని బట్టో.. కాస్త సడలింపులు ఇస్తుంది. మెల్లమెల్లగా కమర్షియాలిటీకి అలవాటు పడుతుంది. కానీ… సాయి పల్లవి అలా చేయలేదు. పదేళ్లయినా తన పద్ధతులు మార్చుకోలేదు. ఈ విషయంలో సాయి పల్లవి నిజంగా గ్రేటే.