చిరంజీవి అంటే సందీప్ రెడ్డి వంగాకు వల్లమాలిన అభిమానం. ‘నా అభిమాన హీరో చిరంజీవి’ అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొన్నారు. `మాస్టర్`లో చిరంజీవి సిగరెట్ కాల్చే సీన్ తనకు చాలా స్ఫూర్తి ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సందీప్. ఈమధ్య ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చిరు ఫొటో బాగా వైరల్ అయ్యింది. చిరుపై సందీప్‌కు ఉన్న ప్రేమకు అది నిదర్శనం.
సందీప్ రెడ్డితో చిరంజీవి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. ఈ విషయమై సందీప్ – చిరు మధ్య భేటీ కూడా జరిగిందట. సందీప్ స్టైల్ వేరు, చిరు ఇమేజ్ వేరు. ఈ రెండింటికీ ఎలా పొంతన కుదురుతుందన్నది అందరి అనుమానం. `యానిమల్`లో అనిల్ కపూర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు చిరంజీవి కోసం ఓ పాత్ర రాసుకొంటే.. అదిరిపోతుంది. చిరుతో పూర్తి స్థాయిలో ఓ సినిమా తీసినా తీయకపోయినా, తాను రాసుకోబోయే కథల్లో చిరు కోసం సందీప్ ప్రత్యేకంగా ఓ పాత్రని సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈమధ్య హీరోల తీరు మారింది. ‘నేను హీరోనే’ అని కట్టుబడి ఉండడం లేదు. నవతరం దర్శకులు, ముఖ్యంగా తమకు నచ్చిన దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిరు కూడా అలానే ఆలోచిస్తే సందీప్ – చిరు కాంబో ఫిక్సయినట్టే. ఏం చెప్పగలం..? రేపు రాబోయే ‘స్పిరిట్’లో చిరు కోసం సందీప్ ఓ పాత్ర సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓ వైపు ప్రభాస్, మరోవైపు చిరు.. మధ్యలో సందీప్ రెడ్డి వంగా. చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఏమో.. గుర్రం ఎగరా వచ్చు.