ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్లో పాలు పంచుకొంటున్నాడు. కల్కి 2 ఎప్పుడైనా మొదలు కావొచ్చు. ఆ తరవాత ‘స్పిరిట్’ ఎలానూ ఉంది. చేతిలో ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకొని, అన్నింటికీ డేట్లు కేటాయిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాసే. ఇది ప్రభాస్‌కు అలవాటైపోయింది కూడా.
అయితే ‘స్పిరిట్’ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం స్ట్రాంగ్ కండీషన్ పెట్టాడని తెలుస్తోంది. ‘స్పిరిట్’ చేస్తున్నప్పుడు మరో సినిమా చేయకూడదని, ఫుల్ టైమ్ స్పిరిట్ కే కేటాయించాలని ప్రభాస్‌కు చెప్పాడట. స్పిరిట్ లుక్ వేరేలా ఉంటుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం బాడీ కూడా బిల్డ్ చేయాలి. తన లుక్ బయటకు వెళ్లకూడదని ప్రభాస్ భావిస్తున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది. ఒకసారి షూటింగ్ మొదలెడితే, ఏక ధాటిగా పని చేసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని, అప్పటి వరకూ ‘స్పిరిట్’ మూడ్‌లోనే ఉండాలని ప్రభాస్‌కు చెప్పాడట దర్శకుడు.
ప్రస్తుతం ‘స్పిరిట్’ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈలోగా ప్రభాస్ ని కూడా తన ప్రాజెక్టులు పూర్తి చేసుకోమని చెప్పాడట. సందీప్ స్టైల్ వేరు. తను పూర్తి డెడికేషన్‌తో పని చేస్తాడు. తన టీమ్ లోనూ అలాంటివాళ్లే ఉండాలనుకొంటాడు. ప్రభాస్ పెద్ద స్టారే కావొచ్చు. కానీ సందీప్ కంటూ ఓ విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం పని చేయాలంటే దర్శకుడు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. పైగా సందీప్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నింటిలోనూ ‘స్పిరిట్’కున్న క్రేజ్ వేరు. అందుకే సందీప్ షరతుల్ని ప్రభాస్ కూడా ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది.