సినిమా పరిశ్రమ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఓ స్టార్ హీరో డేట్లు ఇచ్చాడంటేనే… దర్శక నిర్మాతలకు పండగ. ఓరకంగా సినిమా మొత్తాన్ని నడిపించేది హీరో, అతని ఇమేజ్ మాత్రమే! ‘ఫలానా హీరోయిన్ కావాలి’, ‘ఫలానా టైమ్లో షూటింగ్ పెట్టుకోండి’ అంటే తలాడించాల్సిందే. ప్రభాస్ లాంటి హీరో అయితే – ఇక షరతులన్నీ ఆయనవే. ప్రభాస్ షూటింగ్ కి వస్తే వచ్చినట్టు, రాలేదంటే ‘పేకప్’కి రెడీ అయిపోయినట్టు.. ఇదే వ్యవహారం. దానికి సిద్ధమైతేనే సినిమాలు, షూటింగులు. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆయన కూడా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఏ సినిమాకి ఎప్పుడు డేట్లు ఇస్తారో ఎవరికీ తెలీదు. ఇచ్చినప్పుడు ప్రసాదంలా తీసుకోవడమే. ఇప్పుడు ‘ఫౌజీ’, ‘రాజాసాబ్’ సినిమాల షూటింగులు ఇలానే జరుగుతున్నాయి.
అయితే సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ విషయంలో మాత్రం ప్రభాస్ పప్పులు ఉడకడం లేదు. సందీప్ రెడ్డికంటూ ఓ స్పెషాలిటీ ఉంది. సినిమాని ఎంత ప్రేమిస్తాడో తెలిసిందే. సినిమా తరవాతే ఎవరైనా. తన మాటల్లో, చేతల్లో అదే స్పష్టమవుతూ ఉంటుంది. అందుకే తన నుంచి అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు వచ్చాయి. ‘స్పిరిట్’ విషయంలోనూ తనకు స్పష్టత ఉంది. ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయాలి? అనే విషయంలో గట్టిగా ఫిక్సయి ఉన్నాడు. ప్రభాస్ షరతులు పెట్టడం కాదు, ప్రభాస్ కే షరతులు పెడుతున్నాడు సందీప్ రెడ్డి. తన సినిమా మొదలైనప్ప నుంచీ, పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదన్నది ముందస్తు కండీషన్. ఎందుకంటే ‘స్పిరిట్’ లుక్ వేరు. ఆ లుక్తో బయట ఎక్కువగా కనిపించకూడదన్నది సందీప్ ఉద్దేశం. అంతేకాదు.. కాల్షీట్లు బంచ్గా ఇవ్వాలి. వారానికి ఒకరోజో, రెండు రోజులో ఇస్తే కుదరదు. కాస్త లేట్ అయినా గంపగుత్తగా కాల్షీట్లు ఇవ్వాలి. బాడీ డబుల్స్పై ఆధారపడి షాట్లు తీయకూడదు. అసలు డూప్ ప్రస్తావన లేకపోతే బెటర్… ఇవన్నీ సందీప్ కండీషన్లు. దానికి ప్రభాస్ ఒప్పుకొన్నాడు కూడా.
రెండు మూడు సినిమాలుగా ప్రభాస్ రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. ‘రాజాసాబ్’ విషయంలో ఇదే కనిపించింది. ప్రభాస్ మధ్యమధ్యలో ఫారెన్ ట్రిప్పులు వేస్తున్నాడు. దాంతో సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ పద్ధతికి చెక్ పెట్టడానికే సందీప్ ఈ నిర్ణయం తీసుకొన్నాడు. సందీప్ పట్టుదల ఏమిటో ప్రభాస్ కు తెలుసు. తనకు సరెండర్ అయిపోతే ఎలాంటి సినిమా ఇస్తాడో కూడా తెలుసు. అందుకే ప్రభాస్ కూడా ‘సరే’ అంటున్నాడు. స్టార్ హీరో కాల్షీట్లు ఇచ్చాడు కదా అని వాళ్లకు స్టీరింగ్ అప్పగించేసి, ఆ తరవాత బాధ పడేకన్నా ముందస్తుగానే మేల్కొని, హీరోని తన అధీనంలోకి తీసుకురావడం మేలు. దర్శకుడు అన్నాక చేయాల్సిన మొదటి పని అదే. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా గట్స్ని మెచ్చుకోవాల్సిందే.