పుష్ప 2 బెనిఫిట్ షోతో సాధించిన వసూళ్లు ఎంత ఆశ్చర్యపరిచాయో, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘర్షణ, అక్కడ పోయిన ఓ అభిమాని ప్రాణం అంతగా ఆందోళనకు గురి చేసింది. సినిమా అంటే పిచ్చి వ్యామోహం, వెర్రి అభిమానంతో, కట్టలు తెంచుకొన్న అత్యుత్సాహంతో ఓ అమాయకురాలి ప్రాణం పోయింది. ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంథ్య థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్‌పై కూడా పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. మానవహక్కుల సంఘంలోనూ ఇప్పుడు ఫిర్యాదు నమోదైంది.
సంధ్య థియేటర్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ అందిన ఫిర్యాదుకు మేరకు మానవ హక్కుల సంఘం స్పందించింది. విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. ఈ ఘనటకు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఇది కూడా త్వరితగతిన జరగాలంటూ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్ అయ్యింది. ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది.
మైత్రీ మూవీస్ నిర్మాతలకు ఈ ఘటన తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంలో మైత్రీ మూవీస్ నిర్మాతలపైనా విచారణ జరగొచ్చు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొంటామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.