పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో గాయపడి కోమాలోకి వెళ్లిన అల్లు అర్జున్ చిన్నారి అభిమాని శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఎంత కాలం అయినా అదే పరిస్థితి ఉంటుందని.. ఫిజియో థెరపీ చేసి రీహాబిటేషన్ సెంటర్లో కొంత కాలం ఉంచాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనతో రీహాబిటేషన్ సెంటర్ కు తరలించారు. ఓ పదిహేను రోజులు అక్కడ ఉంచిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
డిసెంబర్ రెండో తేదీన తొక్కిసలాట జరిగింది. అదే రోజు శ్రీతేజ్ తల్లి చనిపోయింది. శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిపోయాడు. తొక్కిసలాట కారణంగా కొంత సేపు బ్రెయిన్ కు రక్తసరఫరా ఆగిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. తర్వాత రక్త ప్రసరణ పునరుద్ధరించినప్పటికీ కోమా నుంచి కోలుకోలేకపోయాడు. విదేశీ వైద్యుల సలహాలు తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నా నోటి ద్వారా ఆహారం, మందులు తీసుకోలేని స్థితిలో ఉన్నాడని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. 15-20 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు.
బ్రెయిన్ కు సంబంధించిన వైద్యం కావడంతో.. బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పటికి కోలుకుంటాడో స్పష్టత లేదు. మనుషుల్ని కూడా గుర్తించలేకపోతున్నారని.. అంటున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పుష్ప టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైద్య పరంగా కావాల్సిన సాయం అందించింది. ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున నిర్మాతలు, అర్జున్ తో పాటు పలువురు సాయం చేశారు.