తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య… ఆ పార్టీలో ఉండరని.. హైకమాండ్ కు ఓ క్లారిటీ వచ్చేసినట్లుగా ఉంది. ఆయన ఎన్నికల్లో గెలిచిన వెంటనే.. ఇచ్చిన టీటీడీ బోర్డు మెంబర్ పదవిని వెనక్కి తీసుకుంది. టీటీడీ బోర్డు మెంబర్ గా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పదవి ఇచ్చి 2 నెలలైనా బాధ్యతలు తీసుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. నిజానికి .. టీడీపీ ప్రభుత్వం ఏపీలో వచ్చిన తర్వాత… ఏర్పాటు చేసిన ప్రతి టీటీడీ బోర్డులోనూ సండ్రకు చోటు దక్కింది. గత ఎన్నికలకు ముందు.. లాభదాయక పదవుల పేరుతో.. నామినేషన్ తిరస్కరిస్తారన్న ఉద్దేశంతో.. తన పదవికి రాజీనామా చేశారు. గెలిచిన వెంటనే మళ్లీ ప్రభుత్వం పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ.. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో పొత్తులు పెట్టుకున్న.. కాంగ్రెస్, టీడీపీ పరాజయం పాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. వారిలో సండ్ర ఒకరు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి సండ్ర.. వేరే ఆలోచనలో ఉన్నారు. రాజకీయ భవిష్యత్, ఇతర అంశాలను బేరీజు వేసుకోవడంతో పాటు… టీఆర్ఎస్ నుంచి ఆకర్షణీయ ఆఫర్ రావడంతో.. ఆయన ఆ పార్టీలో చేరిపోవడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేగా ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేయడమే కాదు.. ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. పార్టీ మారబోతున్నారనే వార్తల్ని ఖండించలేదు. మారితే.. అందరికీ చెప్పే మారుతానంటూ.. చెప్పుకొచ్చారు.
ఓటుకు నోటు కేసులో… సండ్ర వెంకటవీరయ్య కూడా.. నిందితునిగా ఉన్నారు. ఇటీవలి కాలంలో.. ఈ కేసులో మళ్లీ ఈడీ కదలికలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్, వేం నరేందర్ రెడ్డి వంటి వాళ్లను ఈడీ పిలిపించి ప్రశ్నిస్తోంది కానీ.. సండ్ర గురించి ఎలాంటి స్పందన లేదు. దీంతో సండ్ర.. టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. ఇంత కాలం సైలెంట్ గా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడే… ఆయన పదవిని వెనక్కి తీసుకోవడంతో.. పందొమ్మిదో తేదీన జరగబోయే.. మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు కూడా ఉంటుందనే ప్రచారం ప్రారంభమయింది.