ఇప్పుడు కరెంట్ బహిరంగ మార్కెట్లో.. రూ. రెండు రూపాయలలోపే వస్తోందని… చంద్రబాబు సర్కార్.. రూ. నాలుగున్నర రూపాయలు పెట్టి కొనుగోలు చేసిందని.. ఆరోపణలు చేస్తూ.. పవర్ పర్చేజింగ్ ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయనకు కూడా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలున్నాయి. సండూర్ పవర్ అనే కంపెనీతోనే ఆయన వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. జనగ్ మోహన్ రెడ్డి కంపెనీలన్నింటికీ అదే మూలమైన కంపెనీ. ఆ కంపెనీ నుంచి ఇతర కంపెనీలు పుట్టుకొచ్చాయి. సండూర్ పవర్ కంపెనీ ప్రధాన వ్యాపకం.. విద్యుత్ ఉత్పత్తి. ఏ విద్యుత్ కంపెనీ అయినా.. విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికే విక్రయిస్తుంది. అలాగే సండూర్ పవర్ కూడా..కర్ణాటక ప్రభుత్వానికి విక్రయిస్తుంది.
ఇందు కోసం.. ఆ ప్రభుత్వంలో సండూర్ పవర్ కంపెనీ కూడా పీపీఏ చేసుకుంది. దీని ప్రకారం.. సండూర్ పవర్‌కు.. కర్ణాటక సర్కార్.. ఇస్తున్న ధర అక్షరాలా రూ. 4 రూపాయల యాభై పైసలు. అంటే.. నాలుగున్నర రూపాయలకు.. తన కంపెనీ విద్యుత్ ను జగన్మోహన్ రెడ్డి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ మీడియా పాయింట్ లో బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి… తన కంపెనీ విద్యుత్ అమ్మకానికి అంత మొత్తంతో.. పీపీఏ కుదుర్చుకున్నప్పుడు.. ఏపీలో.. అంతే మొత్తం కుదుర్చుకున్నప్పటికీ.. ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. పీపీఏల్లో.. ఎలా ధరలు నిర్ణయం అవుతాయో.. అందరికీ తెలుసని.. అయినా.. గత ప్రభుత్వంపై.. ప్రతీకారేచ్చతోనే జగన్మోహన్ రెడ్డి పీపీఏలపై రాద్దాంతం చేస్తున్నారని అంటున్నారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డికి.. సండూర్ పవర్ పేరుతో అధికారికంగా వ్యాపార సంస్థ ఉన్నప్పటికీ.. ఆయనకు … ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పలు విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి .. కేంద్రం.. హెచ్చరిస్తున్నప్పటికీ.. పీపీఏలపై పట్టుదలకు పోవడం… అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.