ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు… గుంటూరు జిల్లా పాడి రైతుల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అమూల్ సంస్థ కోసమే.. సంగం డెయిరీని ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి.. నేరుగా నరేంద్రను గురి పెట్టిందని అనుమానిస్తున్నాయి. అక్రమాలు జరిగాయని చెప్పి.. విచారణల పేరుతో.. మెల్లగా సంగం డెయిరీకి ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తుందని.. రైతులు అమూల్‌కు మారిపోయేలా చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే.. ఈ అంశం రైతుల్లో కలకలం రేపుతోంది.
గుంటూరు జిల్లా పాడి రైతులకు సంగం డెయిరీకి అవినాభావబంధం. సంగం డెయిరీ ఎదిగిందంటే అది రైతుల వల్లనే. పదేళ్ల క్రితం రూ.రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీ నేడు రూ. పదకొండు వందల కోట్ల టర్నోవర్‌కు చేరింది. రైతులకు టైమ్లీ చెల్లింపులు .. వారి సంక్షేమం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం.. వచ్చిన లాభాలన్నీ బోనస్‌గా రైతులకే పంపిణీ చేయడం.. సంగం డెయిరీ స్పెషాలిటీ. అందుకే రైతులు సంగం డెయిరీకే పాలు పోస్తారు. ఇప్పుడు అమూల్ సంస్థను ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఇటీవలే.. గుంటూరు జిల్లాలో పాల సేకరణను ప్రారంభించారు. అమూల్ సంస్థ చెల్లింపులు సమయానికి ఉండవని.. ఇవ్వకపోయినా ఎవర్నీ అడగలేమన్న భావన మాత్రమే కాదు.. ఏదైనా సమస్య వస్తే.. తమ కోసం ఎవరూ ఉండరన్న అనుమానం ఉంది. అందుకే రైతులు అమూల్‌కు పాలు పోయడానికి పెద్దగా ఇష్టపడటం లేదు.
గుంటూరులో అమూల్ పాల సేకరణ కష్టంగా మారడంతో రైతుల్ని పథకాల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అమూల్‌కు పాలు పోయకపోతే పథకాల్నీ ఆపేస్తామన్న ఓ అధికారి బెదిరింపులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామాల్లో సంగం డెయిరీకి పాలు పోసే రైతులపై ఓ రకమైన ఒత్తిడి కనిపిస్తోంది.దశాబ్దాల అనుబంధం ఉండి.. తమ అభివృద్ధికి కారణమైన సంగం డెయిరీని కాదని ఇతర సంస్థలకుపాలు పోయడానికి రైతులు సిద్ధంగా లేరు. అందుకే నేరుగా చైర్మన్‌ను టార్గెట్ చేస్తే.. రైతులు కూడా భయపడతారన్న అంచనాతో… కేసులు పెట్టి రాత్రికిరాత్రి అరెస్ట్ చేసినట్లుగా రైతులు అనుమానిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న డెయిరీలను నిర్వీర్యం చేసి.. అమూల్‌ను మాత్రమే ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆ సంస్థ కోసం… రెండు, మూడు వేల కోట్ల ప్రజాధనం పెట్టి.. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికి కొంత మొత్తం వెచ్చించింది. రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ సంస్థకే పాలు పోయాలనే ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే అమూల్ వల్ల ఒంగోలు సహకార డెయిరీ మూత పడింది. ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ఆ పరిస్థితి సంగం డెయిరీకి వస్తుందనే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.