ఉమ్మడి మెదక్ జిల్లాను మూడు భాగాలుగా చేస్తే.. అందులో ఓ భాగాన్ని సంగారెడ్డిగా ఏర్పాటు చేశారు. జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలున్నాయి. నిజానికి ఈ జిల్లాలో టీఆర్ఎస్కు ఎప్పుడూ పట్టు లేదు. 2004 ఎన్నికల్లొ ఒక్క సంగారెడ్డిలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జగ్గారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జగ్గారెడ్డి మళ్లీ గెలిచినా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కానీ.. 2014 ఎన్నికల్లో మాత్రం.. టీఆర్ఎస్ పట్టు సాధించింది. ఇప్పుడు కూడా ఐదు నియోజకర్గాల్లో .. ఒక్క జహీరాబాద్ మినహా అభ్యర్థుల్ని ప్రకటించారు. వారంతా ప్రచార బరిలోకి దిగారు. కానీ.. వారికి సమాంతరంగా… వ్యతిరేక ప్రచారం కూడా నడుస్తోంది. చేస్తోంది.. విపక్ష పార్టీల నేతలు కూడా.. సొంత పార్టీల నేతలే.
సంగారెడ్డిలో రెండో సారి టిక్కెట్ దక్కించుకున్న చింత ప్రభాకర్ తన పని తాను చేసుకుపోతున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ
చింత ప్రభాకర్‌ను ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. అనుచరుల్ని పోగేసి.. చేయాల్సిందంతా చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోనూ పరిస్థితి అంతే ఉంది. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న గాలి అనిల్ కుమార్… ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. నారాయణఖేడ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే, రెండో సారి టిక్కెట్ దక్కించుకున్న భూపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు భగ్గుమంటున్నారు. గతంలో ఈయన పై పార్టీ అధిష్టానానికి అనేక ఫిర్యాదు చేశారు. ఖేడ్‌లో ఎమ్మెల్సీ రాములు నాయక్ టిక్కెట్ తనకే వస్తుందని.. బంజారాలతో సభలు , సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక అందోల్ నియోజకవర్గంలో టిక్కెట్ దక్కించుకున్న జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు అసమ్మతి దాదాపుగా లేదు. బాబూమోహన్ తనకంటూ ఓ కార్యకర్త అభిమానాన్ని సంపాదిచుకోకపోగా.. నోటి దురుసుతో.. వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నది అధిష్టానం ఎటూ తేల్చలేదు. దీంతో ఇక్కడి నేతలు ఎవరికి వారే టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ ను బరిలోకి దింపుతారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. కానీ గీతారెడ్డి టీఆర్ఎస్లోకి వస్తారని.. ఆమెకు సీటిస్తారని.. కొన్ని వర్గాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె ఖండిస్తూనే ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా పై కాంగ్రెస్ పార్టీ గట్టి ఆశలు పెట్టుకుంది. ముందుగా సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గెలుస్తాడన్న గట్టి నమ్మకంతో అధిష్టానం ఉంది. జగ్గారెడ్డి అరెస్టుతో వస్తున్న సానుభూతిని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకనే విధంగా వ్యూహం రచిస్తున్నారు. ఇక అందోల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. జహీరాబాద్ నుంచి గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డిని బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. పటాన్ చెరులో కాంగ్రెస్ టిక్కెట్ కోసం నేతలు పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఎవరూ ఎమ్మెల్యే స్థాయిలో ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు కాదు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ .. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీ సురేష్ షెట్కార్, దివంగత మాజీ ఎమ్మెల్యే కుమారుడు సంజీవరెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు.