వేసవి రాకముందే తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి ఉండదంటూ అధికారులు ఏటా చెప్పే మాటలే ఈ ఏడూ చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం..
➡ ఇంటింటికి సురక్షిత మంచినీరందిస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ప్రతి వేసవిలో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రజలు తీవ్ర తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వేసవికి ముందు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామంటూ.. ఎవరూ తాగునీటి కోసం ఇబ్బంది పడకుంటా చూస్తామంటూ అధికారులు చెప్పే మాటలూ ఆచరణకు నోచుకోవడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేస్తారా అంటే అదీ లేదు.
➡ ఇక మిషన్ భగీరథ పథకం కింద ఇప్పట్లో మంచినీరు వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. రోడ్ల పక్కన పైపులు పరిచి పనులు చేస్తున్నారన్న వాతావరణాన్ని కల్పించినా.. ఆ పనుల్లో వేగం లేక ఎక్కడి పనులు అక్కడే ఉంటున్నాయి. ఉన్న పథకాలు పనిచేయక.. కొత్త పథకాలు అమలుకు నోచుకోక ప్రజలు ఎప్పటిలాగే నానా తంటాలు పడాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అన్నది దైవాధీనంగా మారిందని సంగారెడ్డి జిల్లా ప్రజలు వాపోతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో..
నారాయణఖేడ్ నియోజకవర్గంలో, నారాయణఖేడ్ పట్టణంలో ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంత్రి హరీష్రావు ఆదేశాలిచ్చారు. కానీ.. ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే బోరంచ వద్ద బోరంచ స్కీం ఫేజ్ – 2 ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇంతవరకు ఆ పథకం పనులు ఓ కొలిక్కి రాలేదు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో బేరాన్పల్లిలో మూడు కాలల్లో తాగునీటి ఎద్దడి ఉంటోంది. ప్రజలకు తాగునీటిని అందించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడూ ఇక్కడి వారికి నీటి కష్టాలే మిగులుతున్నాయి.
2 వేల 438 గ్రామాల్లో నీటి ఎద్దడి..
మూడు జిల్లాల్లోని మొత్తం 2 వేల 438 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందుకు 2016-17 సంవత్సరానికి గానూ భారీ ఎత్తున నిధులు విడుదలయ్యాయి. కానీ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. జిల్లా కేంద్రాలను అనుకుని ఉన్న గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా నీటి సమస్య తలెత్తితే.. ఇక మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇస్మాయిల్ఖాన్పేట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినా అవి తమ అవసరాలకు సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2 వేల 706 ఆవాస ప్రాంతాలు..
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మూడు జిల్లాల్లో కలిపి 2 వేల 706 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో కేవలం 562 ఆవాస ప్రాంతాలకు మాత్రమే రోజుకు ఒక్కొక్కరికి 40 లీటర్ల తాగునీరు అందుతోంది. 1972 ఆవాస ప్రాంతాల్లో పాక్షికంగానే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా 492 ఆవాస ప్రాంతాల్లోనూ, పీడబ్ల్యూఎస్ ద్వారా 1418 ఆవాస ప్రాంతాల్లోనూ, ఎంపీడబ్యూఎస్ ద్వారా 756 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. మొత్తం 46 మండలాల్లో దాదాపు 10 వేల చేతిపంపులుంటే.. వాటిలో చాలా పంపులు వినియోగంలో లేకుండా పోయాయి.
➡ సమస్య తీవ్రంగా ఉండి మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే.. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమై సమీక్షలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, అధికారులు చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి పొంతన లేదని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటింటికి నల్ల నీళ్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం బీరు కంపెనీలకు నీళ్లిస్తోంది కానీ..ప్రజలకు తాగునీరందించడం లేదని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
➡ ఎక్కడ చూసినా తీవ్ర నీటి ఎద్దడితో తాగునీటి సమస్య తలెత్తినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరందించినా కొంతలో కొంతైనా ఉపశమనం కలుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మంచినీళ్లు అందించండి మహోప్రభో అంటూ వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.