సంగారెడ్డి జిల్లాలో .. ఏ నియోజకవర్గంలో ఎవరన్నదానిపై అన్ని పార్టీల్లో చివరి దశలో క్లారిటీ వచ్చింది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించడంలో జరిగిన ఆలస్యం టీఆర్ఎస్ అభ్యర్థులకు కలిసి వచ్చింది. 65 రోజుల పాటు గులాబీ నేతలు ఏక ధాటిగా ప్రచారం నిర్వహించారు. మహాకూటమిలో అభ్యర్థుల ప్రకటన తరువాత ఇప్పుడు అందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు . జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అందోల్ , జహీరాబాద్ , సంగారెడ్డి స్థానాల నుంచి కాంగ్రెస్ ప్రముఖులైన దామోదర్ రాజనరసింహా , గీతారెడ్డి , జగ్గారెడ్డిలు టీఆర్ఎస్ తో పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్ లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ , పటాన్ చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ పోటీలో ఉన్నారు. ఇందులో ఒక్క కాట శ్రీనివాస్ గౌడ్ మినహా మిగితావన్నీ పాత ముఖాలే. జిల్లాలో జహీరాబాద్ మినహా అన్ని స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనివే. ఈ సారి బీజేపీ కూడా అన్ని చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అందోల్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ , నారాయణఖేడ్ లో కాంగ్రెస్ నుంచి బీజేపిలోకి వచ్చిన సంజీవరెడ్డిలు మాత్రమే ప్రముఖులు. సంగారెడ్డి , పటాన్ చెరు , జహీరాబాద్ స్థానాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు ఓటర్లకు కొత్త ముఖాలే.
ఈ సారి అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల మెనిఫేస్టోలను బాగా హైలెట్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు , చేయాల్సిన అభివృద్ధి పనులను ఫోకస్ చేస్తున్నారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకపోతున్నారు. దీంతో పాటు పంట పెట్టుబడి , పెన్షన్ల పెంపు , రైతుబీమా , కల్యాణలక్ష్మీ , షాదిముబారక్ వంటి పథకాలను బాగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు కాంగ్రేస్ మెనిఫేస్టోలో ప్రకటించిన పెన్షన్ల పెంపు , ఏక కాలంలో రుణమాఫీ , డ్వాక్రా సంఘాలకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు , ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయం వంటి వాటిని ప్రచారం చేస్తున్నారు . జహీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు టీఆర్ఎస్ పార్ఠీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను బాగా హైలెట్ చెస్తున్నారు . కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి కాంగ్రెస్ మెనిఫేస్టోతో పాటు మంత్రిగా పని చేసిన జరిగిన అభివృద్ధిని వివరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందోల్ నియోజక వర్గంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. స్థానిక నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి జర్నలిస్ట్ క్రాంతికిరణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు స్థానిక నినాదాన్ని బాగా వాడుకుంటున్నారు.
స్థానికుడినైన తనకే ప్రజలు మద్ధతివ్వాలని కోరుతున్నారు. కానీ యాభై ఏళ్లుగా.. తన తండ్రి, తాను.. నియోజకవర్గానికి సేవ చేస్తున్నానని దామోదర రాజనర్సింహా, ఇరవై ఏళ్ల కిందటే.. తాను ఆంధోల్ నుంచి గెలిచానని బాబూమోహన్ చెబుతున్నారు. క్రాంతికిరణ్.. హైదరాబాద్ లో పుట్టి పెరిగి… ఆంధోల్ అని చెప్పుకోవడం ఏమిటంటున్నారు. పటాన్ చెరులో టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి చెపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ముఖ్యంగా పటాన్ చెరులో కాలుష్య నివారణ , ఉపాధి కల్పన పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు . కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కూడా కాలుష్య నివారణ కోసం కృషి చేస్తానని చెబుతున్నారు . నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఎమ్మెల్యేగా , ఎంపీగా పని చేసిన సమయంలో జరిగిన అభివృద్ధితో పాటు కాంగ్రేస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోతున్నారు. ఏ ఒక్కరికీ ఎడ్జ్ కనిపిస్తున్న పరిస్థితులు లేవనేది రాజకీయవర్గాల అంచనా.