అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడం ఏడాదిన్నర క్రితం ఆరెస్సెస్ కు ఎంతో సంతోషాన్నిచ్చింది. తాను నాటిన బీజేపీ అనే మొక్క, ఇంత భారీగా విస్తరించడం సంఘ్ కు సంతృప్తినిచ్చే విషయమే. కానీ 19 నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఆనందం ఆవిరయ్యే పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనేది సంఘ్ పెద్దల ఆవేదన.
ముఖ్యంగా ఇటీవలి కొన్ని సంఘటనలు ఆరెస్సెస్ పెద్దలకు నచ్చడం లేదని వార్తలు వస్తున్నాయి. ఎంపీ కీర్తి ఆజాద్ ను సప్పెండ్ చేయడం తొందరపాటు చర్యగా సంఘ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆప్ చేసిన ఆరోపణలనే ఆజాద్ చేశారు. అయితే, ఆదరాబాదరాగా సస్పెండ్ చేయకుండా ఆయన సంజాయిషీ తీసుకోవడం, ఆయన చర్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన తర్వాత సస్పెండ్ చేయాల్సిందనేది సంఘ్ వాదనగా తెలుస్తోంది.
కానీ మోడీ, అమిత్ షా జోడీ ఈ వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని బీజేపీలోని సీనియర్ నేతలు కూడా భావిస్తున్నారు. అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది తెలియాలంటే విచారణకు ఆదేశించడంలో తప్పేంటి? సీబీఐ దర్యాప్తుకి మోడీ ప్రభుత్వం ఆదేశించి ఉంటే ఇంత రభస జరిగేదే కాదు. కీర్తి ఆజాద్ తో చికాకు కలిగేది కాదు. ఆప్ నేతలకు అంత వాయిస్ ఉండేదీ కాదు. జైట్లీ సచ్ఛీలుడనే నమ్మకమే ఉంటే ఈపాటికి విచారణకు ఆదేశాలు జారీ చేయాల్సిందని ఆరెస్సెస్ నేతలు భావిస్తున్నారట.
ప్రధాని నరేంద్ర మోడీ హటాత్తుగా పాకిస్తాన్ లో పర్యటించడం కూడా సంఘ్ పెద్దలకు షాకిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. పాక్ ఎంత బతిమిలాడినా చర్చలకు ఒప్పుకునేది లేదని ఇంత కాలం కేంద్రం చెప్తూ వచ్చింది. మరి హటాత్తుగా ఏం మారిందని మోడీ లాహోర్ వెళ్లారో ఎవరికీ అంతుపట్టడం లేదు. సంఘ్ పెద్దలు పైకి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా, బీజేపీ వ్యవహారాలపై సమీక్ష అవసరమని భావిస్తున్నట్టు తెలుస్లోంది. ఇప్పటికైనా సరైన దిశగా పార్టీ, ప్రభుత్వం నడవకపోతే రాష్ట్రాల్లో, 2019లో లోక్ సభ ఎన్నికల్లో కమలానికి కష్టకాలం తప్పక పోవచ్చనేది ఆరెస్సెస్ ఆందోళన అని సమాచారం. త్వరలోనే మోడీ జోడీ ఈ విషయంపై దృష్టి పెట్టే అవకాశం ఉందనేది బీజేపీ వర్గాల కథనం.