టెన్నిస్ మహిళల డబుల్స్ లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ లను కొట్టే వారే లేరేమో. అరుదుగా అపజయాలు తప్ప, ఈ జోడీ విజయాలకు తిరుగులేదు. జైత్ర యాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తూ ఈ టెన్సిస్ తారలు ఇటాలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెల్చుకున్నారు. ఫైనల్స్ మ్యాచ్ రెండో సెట్ లో ఓడినా, మొదటి, మూడో సెట్లో చెలరేగి ఆడి సత్తాను చాటారు. మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ స్థాయి ఆటతీరును ప్రదర్శించారు.
సానియా, హింగిస్ జోడీ తొలి సెట్ ను 6-1తో గెల్చుకుంది.
ఇందుకు 24 నిమిషాల సమయం పట్టింది. రెండో సెట్ ను 6 (5)-7తో ఓడిపోయింది. మూడోసెట్లో వీరిద్దరూ చెలరేగి ఆడారు. కేవలం 12 నిమిషాల్లో సెట్ ను, మ్యాచ్ ను, టైటిల్ ను కైవసం చేసుకున్నారు.
కెరీర్ మొదట్లో సింగిల్స్ లో సానియా సంచలన విజయాలను సాధించింది. ఆ తర్వాత ఫిట్ నెస్ ఇతర సమస్యల వల్ల డబుల్స్ పై ఫోకస్ పెట్టింది. మార్టినా హింగిస్ తో జోడీ కట్టిన తర్వాత సానియాకు తిరుగులేకుండా పోయింది.
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విభాగంలో సానియా ట్రాక్ రికార్డ్ అంతగా గొప్పగా లేదు. డబుల్స్ లో మాత్రం ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఈ జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది. గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. ఫ్రెంచి ఓపెన్ టైటిల్ మాత్రం ఇంకా సానియాను ఊరిస్తూనే ఉంది. 2011లో ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో ప్రవేశించినా టైటిల్ దక్కలేదు.
హింగిస్ తో కలిసి ఈ లోటుకూడా పూడ్చుకోవడానికి సానియా ప్రయత్నిస్తోంది. అలాగే రియో ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకాన్ని సాధించాలని పట్టుదలగా ఉంది. పెళ్లయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో టెన్నిస్ పైనే దృష్టిపెట్టిన సానియా, ఫిట్ నెస్ కాపాడుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఆడితో రియోలో పతకాన్ని సాధించడం అసాధ్యమేమీ కాదు. అయితే ఒలింపిక్స్ లో హింగిస్ తో జోడీ కట్టడం కుదరదు. దేశాలవారీగా పాల్గొంటారు కాబట్టి మరో భారతీయ క్రీడాకారిణితో కలిసి డబుల్స్ లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఇద్దరి మధ్యా సమన్వయం బాగా కుదిరితే అదేం పెద్ద సమస్య కాదు. రియోలో సానియా మెడలో పతకం మెరిసే క్షణాల కోసం ఎదురు చూద్దాం.