భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సంచలనం సృష్టించింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ ను మార్టినా హింగస్ తో కలిసి కైవసం చేసుకుంది. కెరీర్లో మహిళల డబుల్స్ లో తొలి గ్రాండ్ స్లాం టైటిల్ అందుకుంది. లండన్ లోని వింబుల్డన్ సెంట్రల్ కోర్టు సానియా, హింగిస్ విజయనాదంతో దద్దరిల్లింది. టైటిల్ చేజార్చుకుంటారేమో అనే టెన్షన్ నుంచి, తిరుగులేని విజేతలుగా నిలిచే వరకూ వీరిద్దరూ అద్భతమైన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.
రష్యా అమ్మాయిలు ఎకతరీనా మకరోవా, ఎలెనా మెస్నినాలతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తొలి రౌండ్ల సానియా జోడీ 5-7 స్కోరుతో ఓడిపోయింది. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు. సానియాకు టైటిల్ రాదేమో అని కలవర పడ్డారు. కానీ పడిలేచిన కెరటంలా సానియా, హింగిస్ లు రెండో సెట్లో విజృంభించి ఆడారు. అయినా ప్రత్యర్థి జోడీ హోరాహోరీ పోటీనిచ్చింది. చివరకు 7-6 స్కోరుతో సానియా జోడీ విజయం సాధించింది. ఇక మిగిలించి మూడో రౌండ్. అందులో గెలిచిన వారికే టైటిల్. సానియా, మార్టినా సమన్వయంతో ఆడి ప్రత్యర్థి జోడీని చిత్తు చేశారు. 7-5తో చివరి సెట్ గెల్చుకున్నారు. దాంతో పాటే మ్యాచ్ ను, టైటిల్ ను సొంతం చేసుకున్నారు. సానియా, హింగిస్ లు టాప్ సీడ్ గా బరిలోకి దిగగా, రష్యా జోడీ రెండో సీడ్ గా బరిలోకి దిగారు. చివరకు తుది ఫలితం కూడా అలాగే రావడం విశేషం.
మ్యాచ్ గెలవగానే అమ్మాయిలిద్దరూ నేలమీద లేరు. ఆనందంతో గాలిలో తేలియాడారు. సంతోషంతో కేరింతలు కొట్టారు. తనకైతే ఇది మరో జన్మలా ఉందని మార్టిన హింగిస్ సంబరపడి పోయింది. వింబుల్డన్ లో మరో టైటిల్ గెలవడానికి హింగిస్ 17 ఏళ్లే ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తానికి, సానియాతో జతకట్టిన తర్వాత ఆ నిరీక్షణ ఫలించింది.
సానియా మిర్జీ మిక్స్ డ్ డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినా ఇతర విభాగాల్లో మాత్రం ఒక్కటీ దక్కలేదు. ఇప్పుడా కొరత తీరింది. మహిళల డబుల్స్ లో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ, అదీ అత్యంత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్ గెలవడం సానియా ఇమేజిని తారాస్థాయికి చేర్చింది. సెంట్రల్ కోర్టులో వేల మంది అభిమానుల మధ్య టైటిల్ ను అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది సానియా. నిజంగా తాను మినీ ఇండియాలో ఉన్నట్టుందని సంతోషించింది. పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఈ మ్యాచ్ చూడటానికి వచ్చారు. సానియాను ప్రోత్సహించారు.