షర్మిల పార్టీకి స్టార్ ఎట్రాక్షన్ కూడా జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో వైసీపీలో చేరిన శ్యామల లాంటి పలువురు టీవీ స్టార్లు ఇటీవల షర్మిలతో సమావేశమయ్యారు. తాజాగా…. సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, అజహరుద్దీన్ కుమారుడు అసద్ కూడా.. వెళ్లి షర్మిలతో సమావేశమయ్యారు., వీరిద్దరూ భార్య భర్తలు. సానియా మీర్జా రాజకీయాల కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అజహరుద్దీన్ మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన టీఆర్ఎస్కు దగ్గరగా ఉంటున్నారు. హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నిక కేటీఆర్ సహకారంతోనే జరిగిందని చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో… అసద్, ఆనం ఇద్దరూ షర్మిలతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మర్యాదపూర్వక భేటీ అని ఆనం మీర్జా, అసద్ చెబుతున్నారు. అయితే.. షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చర్చల్లో బిజీగా ఉన్న సమయంలో మర్యాదపూర్వక భేటీలన్నీ… రాజకీయ ఎజెండాతోనే సాగుతూంటాయి. ఖచ్చితంగా… రాజకీయాలే వీరి భేటీలో కీలకమని షర్మిల పార్టీతో సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. అసద్.. క్రికెట్లో పెద్దగా రాణించలేదు. బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆనం మీర్జా కూడా.. సక్సెస్ ఫుల్ కెరీర్ కోసం చూస్తున్నారు. వీరిద్దరూ రాజకీయాలపై ఆసక్తి చూపితే.. గ్రేటర్ పరిధిలో.. ముఖ్యంగా పాతబస్తీ పరిధిలో షర్మిలకు కాస్త ఫేస్ వాల్యూ ఉన్న లీడర్లు దొరుకుతారని అంచనా వేస్తున్నారు.
అయితే.. అసద్, ఆనం మీర్జా షర్మిలను కలవడం వెనుక… సానియా మీర్జా, అజహరుద్దీన్ ప్రమేయం ఉందా.. లేదా.. అసలు వారికి ఈ విషయం తెలుసా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వారి ప్రోత్సాహంతోనే రాజకీయంగా వీరు ముందడుగు వేయాలనుకుంటే మాత్రం.. షర్మిల పార్టీకి గ్లామర్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో వైసీపీలో చేరిన కొంత మంది సినీ తారలు.. స్పోర్ట్స్ సెలబ్రిటీలను… షర్మిల పార్టీ వైపు ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. తొమ్మిదో తేదీన ఖమ్మం సభలో కొన్ని చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు.